రక్తదానంతో ప్రాణాలు కాపాడదాం: ఎమ్మెల్యే గండ్ర
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): రక్తదానంతో ప్రాణాలు కాపాడదామని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పిలుపునిచ్చారు. మానవత్వాన్ని తలపించేలా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో ఆదివారం రక్తదాన శిబిరం ఉత్సాహంగా జరిరింది. ఐటీ మాస్టర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భారీ రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం జీఎస్సార్ మాట్లాడుతూ రక్తదానం అత్యున్నతమైన మానవతా సేవ అని అన్నారు. రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారు, పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయించుకునే రోగులు, గర్భిణీలు, థాలసీమియా లాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే పిల్లలకు రక్తం ప్రాణాధారం అని గుర్తు చేశారు. ఒక యూనిట్ రక్తం ముగ్గురు వ్యక్తుల ప్రాణాలను కాపాడుతుందని తెలిపారు.ప్రతి ఆరోగ్యవంతమైన వ్యక్తి ఏడాదికి మూడు నాలుగు సార్లు స్వచ్ఛందంగా రక్తదానం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం వల్ల దాత ఆరోగ్యానికి ఎలాంటి నష్టం లేదన్నారు. కొత్త రక్తం ఉత్పత్తి అవుతుంది, శరీరానికి మేలు జరుగుతుందని వివరించారు. యువత ముందుకు వచ్చి సామాజిక బాధ్యతతో ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సూచించారు. భూపాలపల్లి ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని జీఎస్సార్ చెప్పారు. జిల్లా కేంద్రంలో రెడ్ క్రాస్ సొసైటీ ఏర్పాటు పనులు శరవేగంగా సాగుతున్నాయన్నారు. వచ్చే ఆరు నెలల్లో భవనం అందుబాటులోకి వస్తుందని, అప్పుడు రక్త సరఫరా ఇంకా సులభం అవుతుందని ప్రకటించారు. శిబిరంలో రక్తదానం చేసిన ప్రతి దాతను జీఎస్సార్ స్వయంగా అభినందించారు. సర్టిఫికెట్లు అందజేసి ప్రోత్సహించారు. రక్తదాన శిబిరాన్ని చక్కగా నిర్వహించిన నిర్వాహకులు వేముల శంకర్, ఐటీ మాస్టర్ బృందాన్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. శిబిరంలో మొత్తం 200 మందికి పైగా యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వం చాటుకున్నారు. భూపాలపల్లిలో ఎమ్మెల్యే జీఎస్సార్ రాకతో యువతలో రక్తదానంపై అవగాహన పెరిగింది. ఒకరి ప్రాణం కాపాడటమే అసలైన సేవ అన్న సందేశం పలువురిని మేలుకొల్పినట్లు అయింది. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ అంబాల శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లూరి మధు, పిప్పాల రాజేందర్, నాగపూరి సమ్మయ్య, దాట్ల శ్రీనివాస్, సాంబమూర్తి, తోట రంజిత్, సుభాష్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఐటీ మాస్టర్ సభ్యులు, కళాశాల విద్యార్థులు, యువకులు, రక్తదాతలు, స్థానిక నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



