మట్టి గణపతిని పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుకుందాం

భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని ఇద్దాం

జడ్చర్ల, సెప్టెంబర్ 10 (జనంసాక్షి): భారతీయ సంస్కృతిలో ఏ పూజ లేదా శుభకార్యం ప్రారంభించినా తొలిపూజ అందుకొనే దేవుడు విఘ్నేశ్వరుడు. సెప్టెంబర్ 14న జరుపుకునే వినాయక చవితి ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణను నేర్పించే పండుగ. ఈ పండుగను పర్యావరణానికి హాని కలగకుండా జరుపుకోవడం మన బాధ్యత. అందుకే అందరం మట్టి గణపతులనే పూజించి పర్యావరణాన్ని కాపాడుకుందాం.

మట్టి గణపతి విశిష్టత:

ఆధ్యాత్మిక ప్రాధాన్యత: మట్టి నుంచి పుట్టి, మట్టిలోనే కలసిపోయే తత్వాన్ని మట్టి వినాయకుని పూజ గుర్తుచేస్తుంది. మట్టి విగ్రహాలు నీటిలో సులభంగా కరిగిపోతాయి. పసుపు, కుంకుమ, మట్టిలోని ఖనిజాల వల్ల జలవనరులు శుభ్రపడతాయి. పార్వతీ దేవి మట్టితోనే గణపతిని తయారు చేసి ప్రాణప్రతిష్ట చేసిందనే పురాణగాథ మట్టి గణపతి విశిష్టతకు ప్రధాన నిదర్శనం.

ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వల్ల నష్టాలు:

పిఓపి విగ్రహాలు నీటిలో త్వరగా కరగవు. నిమజ్జనం తర్వాత నెలల తరబడి నీటిపై తేలుతూ దేవుడిని అవమానించినట్లవుతుంది. విగ్రహాలకు వాడే కెమికల్ రంగులలోని సీసం, కాడ్మియం వంటివి నీటిని తీవ్రంగా కలుషితం చేస్తాయి. కలుషిత నీటి వల్ల చేపలు, ఇతర జలచరాలు చనిపోతాయి. ఆ నీటి వల్ల పశువులకు, మనుషులకు రోగాలు వస్తాయి.

మన బాధ్యత:

దేవుడికి భక్తి ముఖ్యం తప్ప ఆడంబరాలు కావు. ఈ వినాయక చవితికి ఇళ్లలో, మండపాల్లో మట్టి గణపతులనే ప్రతిష్టిద్దాం. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలను బహిష్కరించి భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని కానుకగా ఇద్దాం..