సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి కన్నుమూత

హైదరాబాద్ (జనంసాక్షి) : ఎ ఐ. కె. ఎస్. ఉపాధ్యక్షులు, సిపిఎం సీనియర్ నేత సారంపల్లి మల్లారెడ్డి సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఆయన వయస్సు 88 సంవత్సరాలు. ఆయనకు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు వాసుదేవ రెడ్డి,మధు సూధన్ రెడ్డి. కుమార్తెలు, అనిత, సునీత ఉన్నారు. అనారోగ్య కారణంతో పెద్ద కుమార్తె అనిత ఇటీవలే మృతి చెందారు. వయోరిత్యా శ్వాసకోశ సమస్య రావటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు నాలుగు రోజుల క్రితం నిమ్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అప్పటి నుంచి అక్కడే వైద్యులు వైద్య సేవలందిస్తున్నారు. ఆదివారం అర్ధరాత్రి సమయంలో ఆరోగ్యం మరింత క్షీణించటంతో వైద్యులు అత్యవసర వైద్యం అందించినా ఫలితం లేకపోయింది. సోమవారం తెల్లవారుజామున 3.30గంటలకు మల్లారెడ్డి తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని నిమ్స్ మార్చురీ లో భద్రపరిచారు. సిపిఎం పొలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు, రైతు సంఘం ప్రధాన కార్యదర్శి టి సాగర్, కేవీపీస్ ప్రధాన కార్యదర్శి స్కైలాబ్ బాబు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు బాబురావు తదితరులు మల్లారెడ్డి మృతదేహానికి నివాళులర్పించారు. మల్లారెడ్డి మరణం పట్ల పలువురు నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయన మరణం ప్రజా ఉద్యమాలకు తీరని లోటనీ సంతాపం తెలిపారు.

అరుదైన మేధావి – ఆదర్శ కమ్యూనిస్ట్.

చదివింది పదవ తరగతే. కానీ ఆంగ్లభాషాపై అపారమైన పట్టు..!
ఏ యూనివర్సిటీలో చదవలేదు, కానీ యూనివర్సిటీ విద్యార్థులకే పాఠాలు చెప్పగలిగే విజ్ఞాన బాండాగారం ఆయన. పంట ఏదైనా, ప్రాజెక్ట్ ఏదైనా వేళ్ళమీద లెక్కగట్టి దాని లోతుపాతులు చెప్పగలిగిన నేర్పరి అయన. స్టాక్ మార్కెట్ ఎత్తుపల్లాలను దానివెనుక ఉన్న దోపిడీ దారుల నిజస్వరూపాన్ని విడమరచి వివరించగల విశ్లేషకుడు. సాగుభూమి మొదలూ సామ్రాజ్యవాదం దాకా ఏ విషమం గురించి అయినా అనర్గలంగా మాట్లాడగలిగే అరుదైన మేధావి. పోలీసు పటేల్ జీవితాన్ని వదిలేసి పీడితుల విముక్తి కోసం కాలికి బలపం కట్టుకొని గ్రామ గ్రామాన్ని కలియ తిరిగిన నిక్కారసైనా నాయకుడు. 80 పదుల నిండు వయసులోనూ కంప్యూటర్ తో కుస్తీ పడుతూ యువతరానికి తన జ్ఞానాన్ని పంచేందుకు యాతన పడిన రైతంగా ఉద్యమ నేత. పండితులకు అర్థం విషయాలను కూడా పామరులకు సైతం అర్థం అయ్యే భాషలో పాతిక పుస్తకాలు రాసిన పంచకట్టు పెద్దాయన. నిరంతర అధ్యయన శీలి. నిరాడంబరమైన జీవనం ఆయనది.