గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలు

 

 

 

 

 

 

 

భూదాన్‌ పోచంపల్లి, నవంబర్‌ 19 (జనం సాక్షి):

విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వైజర్‌ డాక్టర్ పూనం మాలకొండయ్య

గ్రంథాలయాలు విద్యార్థుల మనోవికాస కేంద్రాలుగా నిలుస్తున్నాయని విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ అడ్వైజర్‌, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి డాక్టర్ పూనం మాలకొండయ్య అన్నారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా దేశ్‌ముఖి గ్రామంలోని విజ్ఞాన్‌ యూనివర్సిటీలో విజ్ఞాన ధార లైబ్రరీలో పుస్తక ప్రదర్శన, వ్యాసరచన, క్విజ్‌, పోస్టర్ పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ పూనం మాలకొండయ్య మాట్లాడుతూ ఇంటర్నెట్, సోషల్ మీడియాలో వేగంగా అభివృద్ధి జరిగినప్పటికీ పుస్తకాల ప్రాముఖ్యత తగ్గలేదన్నారు. పుస్తకాలు అందించే లోతైన జ్ఞానం, విశ్లేషణా శక్తి, ఆలోచనా సంపత్తి అమూల్యమని పేర్కొన్నారు. విద్యార్థులు తరచూ గ్రంథాలయాలను సందర్శించి పఠనాన్ని అలవాటు చేసుకోవాలని సూచించారు. విజ్ఞాన్స్‌ యూనివర్సిటీ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వై.వీ. దాసేశ్వరరావు మాట్లాడుతూ, గ్రంథాలయాలున్న ప్రాంతాల్లో అవగాహన, చైతన్యం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. యువత గ్రంథాలయాలను సద్వినియోగం చేసుకుంటే మంచి విలువలతో కూడిన జీవితాన్ని నిర్మించుకోవచ్చన్నారు. విజ్ఞాన ధార లైబ్రరీలో వేల పుస్తకాలతో పాటు డిజిటల్‌ లైబ్రరీ సదుపాయం కూడా అందుబాటులో ఉందని వివరించారు. ఈ కార్యక్రమంలో డీన్లు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.