march updates
మార్చ్‌ను శాంతియుతంగా నిర్వహించాలి: బొత్స
విశాఖపట్నం: తెలంగాణ ప్రజలు ‘ మార్చ్’ ను శాంతియుతంగా నిర్వహించాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ కోరారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కల్లించొద్దని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ సమస్యకు త్వరలోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు. మంత్రుల ఒత్తిడితో మార్చ్‌కు అనుమతివ్వలేదని, అన్ని సమస్యలను పరిశీలించి అనుమతిచ్చిందని తెలియజేశారు. అన్ని ప్రాంతాల ప్రజలు సంయమనం పాటించాలని ఆయన కోరారు. రాజకీయ లబ్ధి కోసమే చంద్రబాబు లేఖ ఇచ్చారని పేర్కొన్నారు.
వివేక్ నివాసంలో టీ. కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు భేటీ
హైదరాబాద్: తెలంగాణ మార్చ్ నిర్వహణపై చర్చించేందుకు పెద్దపల్లి ఎంపీ వివేక్ నివాసంలో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు, మంత్రులు, రాజకీయ జేఏసీ నేతలు భేటీ అయ్యారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా నేపథ్యంలో ఎలా నిర్వహించాలనే అంశంపై చర్చిస్తున్నారు. సమావేశానికి ఎంపీలు పొన్నం ప్రభాకర్‌చ మందా జగన్నాథం, కే. కేశవరావుతో పాటు మంత్రులు , జేఏసీ నేతలు ప్రొ. కోదండరాం, స్వామిగౌడ్, విఠల్, శ్రీనివాస్‌గౌడ్‌లు హాజరయ్యారు.
‘అరెస్టులు కొనసాగితే ఆందోళనలు తప్పవు’ హరీష్‌రావు
హైదరాబాద్: తెలంగాణలో అరెస్టుల పరంపర కొనసాగితే ఆందోళనలు తప్పవు అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు హెచ్చరించారు. మార్చ్‌కు ప్రభుత్వం అనుమతిచ్చినా అరెస్టులు చేయడం మంచి పద్దతి కాదని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాలో అరెస్టు చేసిన వారిని విడుదల చేయకపోవడం ప్రభుత్వ దమననీతికి నిదర్శనమని ఆయన ధ్వజమెత్తారు. దీనికి హోంమంత్రి, ఇన్‌ఛార్జి డీజీపీ సమాధానం చెప్పాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గం: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దుర్మార్గమని రాజకీయ జేఏసీ ఛైర్మన్ ప్రొ. కోదండరాం ధ్వజమెత్తారు. ఇవాళ ఉదయమే అరెస్టుల విషయంలో హోంమంత్రి సబిత, జానారెడ్డితో మాట్లాడమని తెలియజేశారు. అరెస్టులన ఆపి, అరెస్టులను ఆపి, అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు.
జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశం
హైదరాబాద్: నగరంలోని జలవిహార్‌లో తెలంగాణ జేఏసీ నేతలు సమావేశమయ్యారు. రేపు జరగబోయే మార్చ్ ఏర్పాట్లపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీజీవో నేత శ్రీనివాస్‌గౌడ్, గాయకుడు రసమయి బాలకిషన్, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు ఈటెల రాజేందర్, జూపల్లి కృష్ణారావుతో పాటు పలువురు పాల్లొన్నారు.
‘తెలంగాణ ఉద్యోగులను ఇబ్బంది పెడితే ఖబడ్దార్’
హైదరాబాద్: తెలంగాణ ఉద్యోగులను పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తే ఖబడ్దార్ అని ఉద్యోగ సంఘాల నేతలు హెచ్చరించారు. ఉద్యోగులను అరెస్టు చేయడం ఆపకపోతే మరోసారి సమ్మెకు దిగుతామని తేల్చిచెప్పారు. ప్రభుత్వం అనుమతి ఇచ్చినా కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణవాదులను హైదరాబాద్‌కు తరలించేలా మంత్రులు బాధ్యత తీసుకోవాలని సూచించారు. పది జిల్లాల్లో అరెస్టు చేసిన ఉద్యోగులను, తెలంగాణ వాదులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. మార్చ్‌లో తెలంగాణ వాదులు వేల సంఖ్యలో పాల్గొని సత్తా చాటాలని ఉద్యోగ సంఘాల నేతలు పిలుపునిచ్చారు.
అనుమతిచ్చి అరెస్టులు చేయడం బాధాకరం: ఎంపీలు
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు ప్రభుత్వం అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం బాధాకరమని తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అన్నారు. జేఏసీ అధికార ప్రతినిధి పిట్టల రవీందర్‌తో పాటు పలువురిని అరెస్టును ఎంపీలు ఖండించారు. అరెస్టు చేసిన వారిని విడుదల చేయాలని డిమాండ్ వ్యక్తం చేశారు. తెలంగాణవాదులు స్వేచ్ఛగా హైదరాబాద్ తరలిరావొచ్చని పేర్కొన్నారు. ఎంపీలమంతా స్వయంగా మార్చ్‌లో పాల్గొంటామని స్పష్టం చేశారు. తెలంగాణ మార్చ్ ప్రజా ఉద్యమం అని తెలంగాణవాదులు వేలాదిగా తరలివచ్చి విజయవంతం చేయాలని కె. కేశవరావు పిలుపునిచ్చారు. ఉస్మానియా విద్యార్థులను అడ్డుకోవద్దని పోలీసులను కోరారు. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని ఆయన డిమాండ్ వ్యక్తం చేశారు. అరెస్టులతో ప్రభుత్వం తెలంగాణవాదులను రెచ్చగొడుతోందని పేర్కొన్నారు. అరెస్టులను ఆపాలని హోంమంత్రిని కోరామని ఆయన చెప్పారు.
తెలంగాణ శక్తిని చూపించే తరుణమొచ్చిందని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. జిల్లాల నుంచి వస్తున్న వారిని అడ్డుకోవద్దని ఆయన పోలీసులకు సూచించారు. తెలంగాణవాదం లేదని చెప్పేందుకు కుట్ర జరుగుతోందని ఆయన తెలియజేశారు. మార్చ్‌కు అనుమతిచ్చి, అడ్డుంకులు సృష్టించడం సరైంది కాదన్నారు. తెలంగాణ మార్చ్ ఒక పవిత్ర యుద్దమని, శాంతియుతంగా నిర్వహించుకోవాలని ఎంపీ రాజయ్య తెలియజేశారు. స్వీయ నియంత్రణతో తెలంగాణవాదులు మార్చ్‌లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. క్రమశిక్షణతో వ్యవహరించి మార్చ్‌ను విజయవంతం చేయాలన్నారు.తెలంగాణవాదులంతా మార్చ్‌ను విజయవంతం చేయాలని ఎంపీ వివేక్ పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వానికి తమ ఆకాంక్ష తెలిపే అవకాశం వచ్చిందని, సత్తా చాటాలని తెలియజేశారు. తెలంగాణ వ్యతిరేకులకు మార్చ్ ఒక గుణపాఠం కావాలని చెప్పారు. తెలంగాణ మార్చ్‌కు తరలివచ్చే ప్రజలకు పోలీసులు సహకరించాలని ఎంపీ పొన్నం ప్రభాకర్ కోరారు. సమైక్యవాదులకు చెంపపెట్టుగా మార్చ్ నిర్వహించాలని ఆయన పిలుపునిచ్చారు. పరస్పర ఆరోపణలు చేసుకోవడం సరికాదన్నారు. అనుమతిచ్చిన తర్వాత పోలీసులు ఆటంకం కలిగించవద్దని ఆయన కోరారు. తెలంగాణ జర్నలిస్టులు కూడా మార్చ్‌లో పాల్గొనాలని తెలిపారు.
సబితాకు ఫోన్ చేసిన టీ, కాంగ్రెస్ ఎంపీలు
హైదరాబాద్: తెలంగాణలో అక్రమ అరెస్టులు నిలిపివేయాలని, చెక్‌పోస్టులు ఎత్తివేయాలని హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డికి తెలంగాణ, కాంగ్రెస్ ఎంపీలు ఫోన్ చేసి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌కు వచ్చే తెలంగాణవాదులకు పోలీసులు సహకరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అక్రమ అరెస్టులను పరిశిలించి, చెక్‌పోస్టుల ఎత్తివేతకు మంత్రి హామీ ఇచ్చారని ఎంపీలు తెలియజేశారు.
‘జరగబోయే పరిణామాలకు సీఎం హోంమంత్రిదే బాధ్యత’
హైదరాబాద్: అరెస్టులను ఆపకపోతే జరగబోయే పరిణామాలకు సీఎం, హోంమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ హెచ్చరించారు. తెలంగాణవ్యాప్తంగా అరెస్టు చేసిన సీపీఐ నేతలను, తెలంగాణవాదులను తక్షణమే విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు కొనసాగించడం ప్రభుత్వ కుటిల నీతికి నిదర్శనమని ఆయన విమర్శించారు. అరెస్టులపై మరోసారి హోంమంత్రిని కలుస్తామని ఆయన తెలిజేశారు.
తెలంగాణ మార్చ్‌కు అడ్డంకులు సృష్టించొద్దు: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌కు సర్కార్ అడ్డంకులు సృష్టించొద్దని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. బైండోవర్ కేసులు పెడితే బీజేపీ నేతలు, కార్యకర్తలు, తెలంగాణవాదులకు సంతకాలు చేయవద్దని, అవసరమైనతే జైలుకెళ్లండి అని సూచించారు. హైదరాబాద్‌కు రాలేని వారు జిల్లాల్లోనే శాంతియుత ర్యాలీలు చేపట్టాలని పిలుపునిచ్చారు.
మధ్యాహ్నం 2 గంటలకు సబితాతో భేటీకానున్న ఓయూజేఏసీ
హైదరాబాద్: ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డితో ఓయూ జేఏసీ భేటీ కానుంది. ఓయూలో అదనపు బలగాలను వెనక్కి రప్పించాలని, తమను మార్చ్‌కు అనుమతించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేయనున్నట్లు సమాచారం. గత రెండు రోజులుగా ఓయూలో పోలీసులు భాష్పవాయు ప్రయోగం జరుపుతున్న విషయం తెలిసిందే. మరోవైపు వడ్డెరబస్తీలో విద్యార్థులను అరెస్టు చేస్తున్నారు.
జంతర్‌మంతర్ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధర్నా
న్యూఢిల్లీ: తెలంగాణ మార్చ్‌కు మద్దతుగా జంతర్‌మంతర్ వద్ద ఢిల్లీ తెలంగాణ జేఏసీ ధార్న చేపట్టింది. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఎన్ని అడ్డంకులు సృష్టించినా మార్చ్ విజయవంతం అవుతుందని తేల్చిచెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడంపై తీవ్రంగా మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రాన్ని తక్షణమే ఏర్పాటు చేయాలని అక్కడి జేఏసీ నేతలు డిమాండ్ వ్యక్తం చేశారు. ఈ ధర్నాలో రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డితో పాటు పలువురు తెలంగాణవాదులు పాల్గొన్నారు.
అక్టోబర్‌లో తెలంగాణ తథ్యం: పాల్వాయి గోవర్థన్‌రెడ్డి
న్యూఢిల్లీ: అక్టోబర్ నెలలో తెలంగాణ రాష్ట్రం తప్పక ఏర్పడుతుందని రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్థన్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం హైకమాండ్‌తో పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ మంతనాలు జరుపుతున్నారని ఆయన తెలియజేశారు. తెలంగాణకు బొత్స అనుకూలంగా ఉన్నారని చెప్పారు.
‘శాంతియుతంగా ఆకాంక్షను తెలియజేద్దాం’
మెదక్: ఆత్మగౌరవాన్ని తెలియడానికి తెలంగాణ మార్చ్ ఒక మంచి వేదిక అని టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు పేర్కొన్నారు. సిద్ధిపేటలో తెలంగాణవాదులు చేపట్టిన దీక్షలు 1000 రోజులకు చేరడంతో వారికి హరీష్‌రావు సంఘీభావం తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… శాంతియుతంగా తమ ఆకాంక్షను తెలియజేద్దామని ఆయన చెప్పారు. మార్చ్‌కు అనుమతి ఇచ్చి అరెస్టులు చేయడం దారుణమన్నారు. అరెస్టులను ఆపేందుకే మంత్రులు జానారెడ్డి, సబితా ఇంద్రారెడ్డిలు చొరవ తీసుకోవాలని కోరారు. టీఆర్‌ఎస్ శ్రేణులంతా పెద్ద ఎత్తున మార్చ్‌లో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.ఎమ్మెల్యేలమంతా కుటుంబసమేతంగా మార్చ్‌లో పాల్గొంటామని తెలియజేశారు. మెదక్ జిల్లా నుంచి సుమారు 200 లారీల్లో హైదరాబాద్‌కు రేపు బయల్దేరుతామని చెప్పారు.
అనుమతి ఇచ్చి, అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారు: కోదండరాం
హైదరాబాద్: తెలంగాణ మార్చ్‌పై ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని తెలంగాణ రాజకీయ జేఏసీ ఆరోపిస్తోంది. మార్చ్‌కు అనుమతి ఇచ్చినట్లే ఇచ్చి అక్రమ అరెస్టులకు పాల్పడుతున్నారని జేఏసీ ఛైర్మన్ కోదండరాం మండిపడ్డారు. అక్రమ అరెస్టులను వెంటనే నిలిపివేసి తాము శాంతియుతంగా నిర్వహించకునే మార్చ్‌కు ప్రభుత్వంతోపాటు పోలీసులు సహకరించాలని కోదండరాం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, జేఏసీ నేత శ్రీనివాస్‌గౌడ్‌లు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అనురాగ్‌శర్మను కోరారు. నెక్లెస్ రోడ్డులో నిర్వహించే మార్చ్‌కు రోడ్ మ్యావ్‌పై ఇప్పటివరకు స్పష్టత ఇవ్వలేదని వారు సీపీకి తెలియజేశారు.