ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం.. నలుగురు ఇంచార్జిల సస్పెన్షన్

నల్లగొండ ప్రతినిధి,మే 08,(జనం సాక్షి): నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణలో నిర్లక్ష్యం వెలుగుచూసింది. కొనుగోలు చేసిన ధాన్య వివరాలను ట్యాబ్‌లో నమోదు చేయకుండా విధుల్లో అలసత్వం ప్రదర్శించిన నలుగురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల (పీఏసీఎస్) ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జీలను జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ శుక్రవారం సస్పెండ్ చేశారు.నల్గొండ మండలం పెద్దసూరారం, నార్కెట్‌పల్లి మండలం బాచకుంట, త్రిపురారం మరియు చండూరు పీఏసీఎస్ ధాన్యం కొనుగోలు కేంద్రాలకు చెందిన ఇన్‌చార్జీలు కొనుగోలు చేసిన ధాన్యాన్ని ట్యాబ్ ఎంట్రీ చేయకపోవడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ధాన్యం కొనుగోలు ప్రక్రియలో పారదర్శకత, వేగవంతమైన చెల్లింపుల కోసం ట్యాబ్ ఎంట్రీలు కీలకమని పేర్కొంటూ, నిర్లక్ష్యానికి పాల్పడిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.ఈ మేరకు సంబంధిత నలుగురు కేంద్రాల ఇన్‌చార్జీలను తక్షణమే విధుల నుంచి సస్పెండ్ చేసినట్లు ప్రకటించారు.