సర్పంచ్ నామినేషన్ లో రిటర్నింగ్ అధికారి నిర్లక్ష్యం.

ఆర్మూర్,డిసెంబర్ 4(జనంసాక్షి):

– న్యాయం చేయాలని సబ్ కలెక్టర్ కి ఫిర్యాదు.

– ఆర్వో నిర్లక్ష్యమన్న జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి.

గ్రామ సర్పంచ్ గా నామినేషన్ వేసిన సందర్భంలో సరైన కారణం లేకుండా నామినేషన్ పత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని జక్రాన్పల్లి మండలం మునిపల్లి గ్రామానికి చింతల గోపి బిజెపి జిల్లా అధ్యక్షుడు దినేష్ కుమార్ కులచారి ఆధ్వర్యంలోగురువారం సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాకు ఫిర్యాదు చేశారు.మునిపల్లి గ్రామంలో సర్పంచ్ గా ఇద్దరు నామినేషన్ వేయగా పోటీలో ఉన్న వ్యక్తి ఆర్టీసీ ఉద్యోగం నుండి తీసివేసారని అభ్యంతరం తెలపడంతో రిటర్నింగ్ అధికారి నామినేషన్ పత్రాన్ని తాత్కాలికంగా నిలిపివేశారని జిల్లా బిజెపి అధ్యక్షుడు దినేష్ కులచారి సబ్ కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు.నామినేషన్ దారు ఏదైనా అవినీతికి, లంచగొండిగా, విశ్వాసగత నేరాలకు పాల్పడితేనే ఉద్యోగం నుండి వైదొలిగితే పంచాయతీరాజ్ చట్టం ప్రకారం అనర్హుడని చెప్పారు.తండ్రికి సంబంధించిన ఉద్యోగం చాలీచాలని జీతంతో ఆర్టీసీలో ఉద్యోగం చేయలేని గోపీని ఆర్టీసీ అధికారులు ఉద్యోగం నుండి తొలగించారు.అధికార పార్టీ నాయకుల ప్రలోభాలకు లోబడి రిటర్నింగ్ అధికారి అర్హులైన అభ్యర్థిని తాత్కాలికంగా నిలిపివేయడం సరైనది కాదన్నారు. మునిపల్లి గ్రామంలో మునుపటి రిజర్వేషన్ నే ఖరారు చేయడంపై ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యబద్ధంగా జరగాల్సిన సర్పంచ్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీకి పోటీదారు ఉండకూడదనే ఉద్దేశంతో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు.ఇందుకు రాష్ట్ర సలహాదారుడు సుదర్శన్ రెడ్డి,మంత్రి సీతక్క ఎమ్మెల్యే భూపతి రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ఎన్నికల అధికారి స్పందించి పంచాయతీరాజ్ చట్టం ప్రకారం మునిపల్లి అభ్యర్థిని అర్హుడిగా ప్రకటించాలన్నారు.