“యూరియా కొరత లేదంటున్న అధికారులు.. ఎరువుల కోసం రైతుల పడిగాపులు!”
సిరికొండ, జూన్ 10(జనం సాక్షి ):సిరికొండ మండలంలో యూరియా కొరత లేదని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పరిస్థితులు అందుకు భిన్నంగా కనిపిస్తున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులు జోరుగా సాగుతున్న తరుణంలో యూరియా కోసం రైతులు గంటల తరబడి క్యూల్లో వేచి ఉండాల్సి వస్తోందని వాపోతున్నారు. యాప్ ద్వారా ముందస్తుగా బుకింగ్ చేసుకున్న రైతులు సైతం ఎరువుల కోసం కేంద్రాల వద్ద నిరీక్షించాల్సిన పరిస్థితి నెలకొంది.యూరియా పంపిణీ కేంద్రాల వద్ద భారీ సంఖ్యలో రైతులు తరలిరావడంతో రద్దీ వాతావరణం ఏర్పడింది. బుక్ చేసుకున్న రైతులను వరుసలో నిలబెట్టి పంపిణీ ప్రక్రియను నిర్వహించేందుకు పోలీసులు, సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. కొంతమంది రైతులు తెల్లవారుజామునే కేంద్రాలకు చేరుకున్నప్పటికీ తమ వంతు వచ్చే వరకు గంటల తరబడి వేచి ఉండాల్సి వచ్చిందని తెలిపారు.గతంలో గ్రామానికి సమీపంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (సొసైటీలు) ద్వారా ఎరువులు సులభంగా అందుబాటులో ఉండేవని రైతులు గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం యాప్ ఆధారిత విధానం అమలులోకి రావడంతో 15 నుంచి 20 కిలోమీటర్ల దూరంలోని కేంద్రాలకు వెళ్లాల్సి వస్తోందని, దీనివల్ల అదనపు రవాణా ఖర్చులు, సమయ నష్టం జరుగుతోందని పేర్కొన్నారు. సాగు పనులు అత్యవసరంగా ఉన్న సమయంలో రోజంతా ఎరువుల కోసం తిరగాల్సి రావడం ఇబ్బందికరంగా మారిందన్నారు.మరోవైపు మండలంలో అవసరమైన మేర యూరియా నిల్వలు ఉన్నాయని, రైతులకు ఎలాంటి కొరత లేకుండా సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. అయితే రైతులు మాత్రం కేంద్రాల వద్ద కనిపిస్తున్న రద్దీ, ఆలస్యాలే సమస్యలకు కారణమవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు.యాప్ ఆధారిత విధానంతో పాటు గ్రామ స్థాయిలోనే పంపిణీ కేంద్రాలను పెంచాలని, గతంలో అమలులో ఉన్న సొసైటీ యూనిట్ విధానాన్ని పునరుద్ధరించాలని రైతులు కోరుతున్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ఎరువుల పంపిణీ వ్యవస్థను మరింత సులభతరం చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు.



