మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు

 

 

 

 

 

 

ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి

ప్రాజెక్టుల పురోగతిపై అధికారులతో సమీక్ష

మక్తల్, జూన్ 05 (జనంసాక్షి)మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్ష ఎకరాలకు సాగునీరు అందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలిపారు. కృష్ణా, భీమా నదులపై నిర్మించనున్న ప్రాజెక్టు పనుల పురోగతిపై గురువారం ముఖ్యమంత్రి బెంగుళూరు నుంచి నేరుగా మక్తల్ చేరుకున్నారు.ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చిన ముఖ్యమంత్రికి రాష్ట్ర మంత్రులు డాక్టర్ వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మఖ్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భీమా కృష్ణా నదులపై ప్రతిపాద బ్యారేజీ పనులు పురోగతికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ప్లాన్ మ్యాప్స్ ద్వారా ముఖ్యమంత్రికి ఇరిగేషన్ అధికారులు వివరించారు.
అనంతరం మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా కాట్రపల్లి గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న పంప్‌హౌస్ పనులను సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి, నిర్మాణ పనుల స్థితిగతులను మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి వివరించారు. పాలమూరు ప్రాంతానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతిపై సీఎం ప్రత్యేకంగా ఆరా తీశారు. పనులు వేగంగా, నాణ్యతతో పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.
అంతకుముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా బందోబస్తు ఏర్పాట్లను జోగులాంబ జోన్ డిఐజి చౌహాన్, జిల్లా ఎస్పీ డా. వినీత్ పరిశీలించారు. పోలీసు అధికారులు, సిబ్బందికి భద్రతా పరమైన సూచనలు చేశారు. అనంతరం ముఖ్యమంత్రికి పూలమొక్క అందించి మర్యాదపూర్వకంగా స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, కర్ణాటక రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి బోసు రాజు, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, డాక్టర్ వాకిటి శ్రీహరి, జిల్లా కలెక్టర్ సీహెచ్ ప్రియాంక, ఇరిగేషన్ శాఖ కార్యదర్శి శ్రీధర్, చీఫ్ ఇంజనీర్ ఎ. సత్యనారాయణ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజనీర్ హెచ్.టి. శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు