పంట అవశేషాల కాల్చివేతపై సంపూర్ణ నిషేధం

ఉల్లంఘిస్తే కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ చాహత్ బాజ్‌పాయ్

హనుమకొండ, ప్రతినిధి జూన్ 4 (జనం సాక్షి) :పంట అవశేషాలను కాల్చడం వల్ల వాయు కాలుష్యం పెరగడంతో పాటు పర్యావరణ సమతుల్యత దెబ్బతిని, నేల సారవంతత తగ్గిపోవడం, ప్రజారోగ్యం ప్రమాదంలో పడటం వంటి తీవ్ర పరిణామాలు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో హనుమకొండ జిల్లా వ్యాప్తంగా పంట వ్యర్థాల కాల్చివేతను తక్షణమే నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ & జిల్లా మేజిస్ట్రేట్ శ్రీమతి చాహత్ బాజ్‌పాయ్ ఉత్తర్వులు జారీ చేశారు.వ్యవసాయ పంటల కోత అనంతరం పొలాల్లో మిగిలిపోయే పంట అవశేషాలను తగులబెట్టడం వల్ల హానికర వాయువులు వెలువడి వాతావరణ కాలుష్యం పెరగడమే కాకుండా, ప్రజల ఆరోగ్యం, మానవ జీవనం, రహదారి భద్రత మరియు పర్యావరణంపై ప్రతికూల ప్రభావం పడుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. భూమి
లోని సేంద్రియ పదార్థాలు, ఉపయోగకర
మైన సూక్ష్మజీవులు నశించి భూసారం క్షీణిస్తుందని తెలిపారు.ప్రజా భద్రత, పర్యావరణ పరిరక్షణ, ప్రజా శాంతిభద్రతల దృష్ట్యా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బి ఎన్ ఎస్ ఎస్-2023 సెక్షన్ 163 కింద సంక్రమించిన అధికారాలను వినియోగిస్తూ జిల్లాలోని అన్ని గ్రామాలు, వ్యవసాయ భూములు, పొలాల్లో పంట అవశేషాల కాల్చివేతను తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు నిషేధిస్తున్నట్లు స్పష్టం చేశారు.ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ స్థానం సెక్షన్ 223 ప్రకారం కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఉల్లంఘన వల్ల ప్రజలకు ఇబ్బందులు, ఆరోగ్య సమస్యలు లేదా మానవ ప్రాణాలకు ప్రమాదం కలిగితే జైలు శిక్షతో పాటు జరిమానా విధించే అవకాశం ఉందని పేర్కొన్నారు.జిల్లాలోని తహశీల్దార్లు, ఎంపీడీఓలు, వ్యవసాయ అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, పోలీస్ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పంట కోతల సమయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని, ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై వెంటనే చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.అదేవిధంగా వ్యవసాయ, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, కాలుష్య నియంత్రణ శాఖలు సమన్వయంతో పనిచేసి ఉత్తర్వులను కట్టుదిట్టంగా అమలు చేయాలని సూచించారు. అవశేషాలను కాల్చడం అంటే భూమాతను, పర్యావరణాన్ని, మన భవిష్యత్తును కాల్చినట్టే. రైతులు ప్రత్యామ్నాయ పద్ధతులను అనుసరించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలి. ప్రతి గ్రామం కాలుష్య రహితంగా, ప్రతి పొలం సారవంతంగా ఉండేలా అందరూ సహకరించాలని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయ్ పిలుపునిచ్చారు.