నల్లకోటుకు నూతన బలం.. సమష్టి కృషికి దక్కిన విజయం
న్యాయాన్ని రక్షించే చేతులకు.. ఇక చట్టబద్ధ రక్షణ!
న్యాయ పోరాటానికి దక్కిన గౌరవం.. లాయర్ల పరిరక్షణే ధ్యేయం!
ఖానాపూర్ రూరల్ 4 జూన్ (జనం సాక్షి): న్యాయవాదుల రక్షణ, భద్రత కోసం రూపొందించిన తెలంగాణ న్యాయవాదుల రక్షణ చట్టం-2026 జూన్ 2 నుంచి అధికారికంగా అమల్లోకి వస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 41 విడుదల చేస్తూ మంగళవారం గెజిట్ విడుదల చేసింది. ప్రభుత్వం ఈ చట్టాన్ని అమల్లోకి తీసుకురావడం పట్ల న్యాయవాదులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చట్టంలోని ముఖ్యమైన నిబంధనలు న్యాయవాదులు లేదా వారి కుటుంబ సభ్యులపై దాడులు, బెదిరింపులు, వేధింపులకు పాల్పడితే జైలు శిక్ష, జరిమానా విధిస్తారు. పోలీసు యంత్రాంగం న్యాయవాదులను ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడానికి వీల్లేదు. చీఫ్ జుడీషియల్ మెజిస్ట్రేట్ ముందస్తు అనుమతి లేదా కోర్టు ఆదేశాల మేరకు మాత్రమే తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ చట్టం కింద నమోదయ్యే కేసులను డీఎస్పీ లేదా అంతకంటే పైస్థాయి అధికారి మాత్రమే దర్యాప్తు చేయాలి. 60 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేసి, 6 నెలల్లోగా కోర్టు విచారణ ముగించాల్సి ఉంటుంది.
న్యాయవాదుల సమష్టి కృషి ఫలితం…మట్టేరి రాజశేఖర్, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఖానాపూర్
కక్షిదారులు న్యాయవాదులపై వ్యక్తిగత కక్షలు పెంచుకుని దాడులకు పాల్పడుతున్నారు. ఇప్పటికే పదుల సంఖ్యలో న్యాయవాదుల హత్యలు జరిగాయి. దీనిని దృష్టిలో పెట్టుకున్న రాష్ట్ర ప్రభుత్వం న్యాయవాదుల పరిరక్షణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేసి, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చట్టాన్ని అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం హర్షణీయం, ఇది న్యాయవాదులు సాధించిన సమష్టి కృషి ఫలితం.



