సీఎం రేవంత్ రెడ్డి జడ్చర్ల పర్యటన.. మహర్దశ పట్టేనా..

నేటి సమావేశంపైనే నియోజకవర్గ ప్రజల ఆశలు
జడ్చర్ల, జూన్ 6 (జనంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి జడ్చర్ల పట్టణ పర్యటన ఖరారు కావడంతో నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజల్లో సరికొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వేగంగా విస్తరిస్తూ, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే కీలక వాణిజ్య కేంద్రంగా ఎదుగుతున్న జడ్చర్ల పట్టణ సమగ్ర అభివృద్ధికి ఈ పర్యటన ఒక మైలురాయిగా మారుతుందని స్థానికులు భావిస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనను పురస్కరించుకుని పట్టణంలోని దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం లభిస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి స్పష్టమైన హామీలతో పాటు నిధుల వరాలు కురిపిస్తారని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
చిగురిస్తున్న నిర్వాసితుల ఆశలు:
ఉదండాపూర్ రిజర్వాయర్ నిర్వాసిత గ్రామాల ప్రజలు కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ఎంతో ఆవేదనతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టు పరిశీలనకు రానుండటంతో నిర్వాసితుల్లో మళ్లీ ఆశలు చిగురిస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు.. ఇప్పుడు సీఎం పర్యటన ద్వారా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ డబ్బులు చెల్లించడంతో పాటు, ఇళ్ల స్థలాల సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని బాధితులు ఎంతో నమ్మకంతో ఆశిస్తున్నారు.
రింగ్ రోడ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చేనా..
రోజురోజుకూ పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీ జడ్చర్ల ప్రజలను తీవ్రంగా వేధిస్తోంది. జాతీయ రహదారిని ఆనుకుని ఉండటం, పారిశ్రామికంగా, వ్యాపారపరంగా లావాదేవీలు పెరగడంతో పట్టణంలో వాహనాల రాకపోకలు విపరీతంగా పెరిగాయి. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారంగా ‘రింగ్ రోడ్’ నిర్మాణానికి ప్రభుత్వం ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తుందో, అవసరమైన నిధులను ఎప్పుడు మంజూరు చేస్తుందో అని స్థానికులు ఎంతో ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి ఈ పర్యటనలోనే రింగ్ రోడ్ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన చేయాలని కోరుతున్నారు.
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్:
పట్టణ విస్తరణ వేగంగా జరుగుతున్న నేపథ్యంలో శాంతిభద్రతల పరిరక్షణకు, ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక పోలీస్ స్టేషన్ల ఏర్పాటు అత్యవసరంగా మారింది. జనాభా అవసరాలకు అనుగుణంగా జడ్చర్లకు ప్రత్యేక ‘టౌన్ పోలీస్ స్టేషన్’ తో పాటు, నిత్యం జరిగే ట్రాఫిక్ ఇబ్బందులను అధిగమించడానికి, ప్రమాదాల నివారణకు ప్రత్యేక ‘ట్రాఫిక్ పోలీస్ స్టేషన్’ ను ఏర్పాటు చేయాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.
బస్సు డిపోపై ప్రయాణికుల భారీ ఆశలు:
నిత్యం వేలాది మంది ప్రయాణికులు, విద్యార్థులు, ఐటీఐ, డిగ్రీ కళాశాలల విద్యార్థులు వివిధ ప్రాంతాల నుండి జడ్చర్లకు రాకపోకలు సాగిస్తుంటారు. పెరుగుతున్న ప్రయాణికుల అవసరాల దృష్ట్యా జడ్చర్లకు ప్రత్యేకంగా ఒక ‘బస్సు డిపో’ ఏర్పాటు చేసి, చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాలకు కొత్త ఆర్టీసీ సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.
సీఎం వరాల కోసం ఎదురుచూపులు:
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జడ్చర్ల భవిష్యత్ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని, నేటి సమావేశంలో ఈ ప్రధాన సమస్యలపై సానుకూలంగా స్పందించి, రింగ్ రోడ్, పోలీస్ స్టేషన్లు, బస్సు డిపో ఏర్పాటుపై స్పష్టమైన హామీలు ఇవ్వాలని జడ్చర్ల నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యమంత్రి పర్యటనతో జడ్చర్ల భవిష్యత్తుకు సరికొత్త దిశానిర్దేశం లభిస్తుందో లేదో చూడాలి..



