ఉప్పల్ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు

 

 

 

 

 

 

పెండింగ్ పనులకు నిధులు మంజూరు చేయాలని కమిషనర్‌కు మందుముల పరమేశ్వర్ రెడ్డి వినతి

ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధుల కేటాయింపు కోరుతూ వినతిపత్రం

ఉప్పల్, జూన్ 5 (జనం సాక్షి): ఉప్పల్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి మరోసారి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చారు. ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్‌తో పాటు నియోజకవర్గ పరిధిలోని పలు కాలనీల్లో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే చేపట్టి, అవసరమైన నిధులను మంజూరు చేయాలని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డిని కలిసి కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జిల్లా ఇంచార్జ్ మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు కమిషనర్‌ను కలిసిన పరమేశ్వర్ రెడ్డి, నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉప్పల్ నియోజకవర్గం వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రాంతమైనప్పటికీ అనేక కాలనీల్లో ఇప్పటికీ కనీస మౌలిక వసతుల కొరత ఉందన్నారు. ముఖ్యంగా ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల్లో పలు రహదారులు దెబ్బతిన్నాయని, వర్షాకాలంలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. తాగునీటి సమస్యలు, వర్షపు నీటి నిల్వలు, డ్రైనేజీ వ్యవస్థ లోపాలు, కమ్యూనిటీ హాల్స్ లేకపోవడం వంటి సమస్యలు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.

నియోజకవర్గంలోని అనేక కాలనీల్లో సీసీ రోడ్లు, బీటీ రోడ్లు, స్టార్మ్ వాటర్ డ్రైన్లు నిర్మించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వర్షాలు కురిసిన ప్రతిసారి రహదారులు దెబ్బతిని ప్రజలకు రాకపోకలు కష్టతరంగా మారుతున్నాయని వివరించారు. అనేక ప్రాంతాల్లో ఖాళీ స్థలాలు ఉన్నప్పటికీ కమ్యూనిటీ హాల్స్ లేకపోవడం వల్ల సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు.

ప్రత్యేకంగా కాప్రా సర్కిల్ పరిధిలోని పలు కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, పార్కుల అభివృద్ధి, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం, నాలాలపై స్లాబ్‌లు ఏర్పాటు వంటి పనులను అత్యవసరంగా చేపట్టాలని కోరారు. ఈ పనులు పూర్తయితే వేలాది కుటుంబాలకు ప్రత్యక్షంగా ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు.

ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాలు హైదరాబాద్ నగర అభివృద్ధిలో కీలక ప్రాంతాలుగా మారుతున్నాయని, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మౌలిక వసతుల అభివృద్ధికి మరింత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.

ప్రజల నుంచి వచ్చిన వినతులు, స్థానిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనుల జాబితాను సిద్ధం చేసి కమిషనర్‌కు అందజేసినట్లు తెలిపారు. ముఖ్యంగా అంతర్గత రహదారులు, తాగునీటి పైపులైన్లు, వర్షపు నీటి కాలువలు, కమ్యూనిటీ హాల్స్, పార్కుల అభివృద్ధి, నాలాల మరమ్మతులు వంటి పనులకు తక్షణమే నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.

వినతిపత్రాన్ని స్వీకరించిన కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రతిపాదనలను పరిశీలించి సంబంధిత శాఖలతో చర్చించి సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సమాచారం.

ఈ కార్యక్రమంలో కాప్రా మాజీ కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, అంజి రెడ్డి, హెచ్.ఆర్. మోహన్, కాప్రా సాయి గౌడ్, విఠల్ నాయక్, ఉపేందర్ రెడ్డి, మహేష్ యాదవ్, నూతులకంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

ఉప్పల్ నియోజకవర్గంలోని ఉప్పల్, హబ్సిగూడ, రామంతాపూర్, చిలుకానగర్ ప్రాంతాల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు త్వరలోనే నిధులు మంజూరై పనులు ప్రారంభమవుతాయని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులు చేపడితే నియోజకవర్గ రూపురేఖలు పూర్తిగా మారుతాయని అభిప్రాయపడుతున్నారు.

తాజావార్తలు