నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై రైతుల రాస్తారోకో నిలిచిన వడ్ల కొనుగోళ్లు
మాడుగులపల్లి, జూన్ 09( జనం సాక్షి): గండ్రవాణి గూడెం ఐకేపీ కేంద్రంలో వడ్ల కొనుగోలు ప్రక్రియ నిలిచిపోవడానికి నిరసిస్తూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు మంగళవారం మండల పరిధిలోని కుక్కడం వద్ద నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై రైతులు భారీ రాస్తారోకో నిర్వహించారు వేములపల్లి పి ఎస్ సి ఎస్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ కొనుగోలు కేంద్రంలో నిర్వాహకులు, అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము రోడ్డుపైకి రావలసి వచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ కేంద్రానికి వడ్లు తీసుకొచ్చి రోజులు గడుస్తున్నా నిర్వాహకులు కొనుగోలు చేయడం లేదని ధ్వజమెత్తారు ఆకాశం మబ్బుపట్టి, ఎప్పుడు వర్షం వస్తుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు ధాన్యం తడిసిపోతే తాము తీవ్రంగా నష్టపోతామని, రోజుల తరబడి కేంద్రాల వద్దే పడిగాపులు కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. రైతులు ఒక్కసారిగా నార్కట్‌పల్లి-అద్దంకి హైవేపై బైఠాయించడంతో ఇరువైపులా కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు సమాచారం అందుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రైతులతో చర్చలు జరిపారు ఉన్నతాధికారులతో మాట్లాడి తక్షణమే వడ్ల కొనుగోలు ప్రక్రియను ప్రారంభించి, వేగవంతం చేస్తామని అధికారులు గట్టి హామీ ఇవ్వడంతో రైతులు శాంతించి ధర్నా విరమించారు త్వరితగతిన కొనుగోళ్లు పూర్తి చేయకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రైతులు హెచ్చరించారు.



