ఉన్నతాధికారుల తీరుపై పవన్ కల్యాణ్ ఫైర్
చంద్రబాబు నాయుడు కేబినెట్‌లోని పలువురు మంత్రుల పట్ల కొందరు ఉన్నతాధికారులు వ్యవహరిస్తున్న తీరుపై అసెంబ్లీ లాబీలో చర్చ జరిగింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మధ్య జరిగిన సంభాషణల్లో పలు అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తుంది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు సంబంధించి.. సభలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఉన్నతాధికారులు సరైన సమాధానాలు ఇవ్వడం లేదు.
ఆ క్రమంలో సదరు ఉన్నతాధికారులపై మంత్రులు పవన్ కల్యాణ్, డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ బడ్జెట్ సమావేశాలు సోమవారం ప్రారంభమైనాయి. అందులోభాగంగా మూడోరోజు అంటే.. బుధవారం సభలో స్పీకర్ సిహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రశ్నోత్తరాల సమయం చేపట్టారు. పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు అధికారులు సరైన సమాచారం ఇవ్వలేదు.
గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లింపు విషయంలో అధికారులు అందించిన సమాచారంపై పవన్ కల్యాణ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా.. పొడి పొడి సమాధానాలు చెప్పడం పట్ల మంత్రి పవన్ అభ్యంతరం తెలిపారు. ఇలాగే సమాధానాలు చెప్పాలని ఏమైనా నిబంధనలున్నాయా? అంటూ అధికారులను ఆయన ప్రశ్నించారు.
సభ్యులు అడిగిన ప్రశ్నలకు కచ్చితమైన సమాధానాలు ఇచ్చేలా ఉండాలని అధికారులకు ఈ సందర్భంగా పవన్ సూచించారు. ఇక ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు నిధులు మళ్లింపు అంశంపై అధికారులు చెప్పిన సమాధానం పట్ల మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అసహనం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో గ్రామ పంచాయతీలకు నిధులు మళ్లింపు, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు నిధుల మళ్లింపుపై పూర్తి స్థాయిలో వివరాలు అందజేయాలని మరోసారి ఉన్నతాధికారులను మంత్రులు ఆదేశించారు.
మరోవైపు గత వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో ఏ ఏ పథకాలకు ఎంత మేర నిధులు కేటాయించింది. అవి ఏ మేర క్షేత్ర స్థాయికి చేరాయి. వాటి వల్ల ప్రజలుకు ఎంత మేర ప్రయోజనం చేకూరింది అనే అంశాలపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ క్రమంలో మంత్రులు అడుగుతున్న ప్రశ్నలకు.. ఆ యా శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కచ్చితమైన సమాధానాలు ఇవ్వడం లేదు. దీంతో ఉన్నతాధికారుల తీరుపై పలువురు మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.