గంజాయి నిర్మూలన, రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెరగాలి – డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్
తోషం గ్రామసభలో పాల్గొన్న రాష్ట్ర డీజీపీ
యువత మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా, రోడ్డు ప్రమాదాల నివారణకు కలిసికట్టుగా కృషి చేయాలి
గుడిహత్నూర్ ( జనం సాక్షి) ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాలోని గుడిహత్నూర్ మండలం తోషం గ్రామంలో బుధవారం నిర్వహించిన గ్రామసభలో ,డీజీపీ సి.వి. ఆనంద్ ఐపీఎస్ పాల్గొన్నారు.గ్రామసభ ప్రారంభానికి ముందు ఆదివాసి సంస్కృతి, సంప్రదాయాల ప్రకారం గ్రామ పెద్దలు, గ్రామస్తులు డీజీపీకి ఘన స్వాగతం పలికారు. అనంతరం కొమరం భీం విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గుస్సాడి కళాకారులు సంప్రదాయ నృత్య ప్రదర్శనలతో అతిథులను ఆహ్వానిస్తూ కార్యక్రమం కొనసాగింది.ఈ సందర్భంగా గ్రామస్తులు, ఆదివాసీల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. యువత గంజాయి మరియు ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాలు వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు, సమాజంపై కూడా ప్రతికూల ప్రభావం చూపుతాయని తెలిపారు. యువత విద్య, క్రీడలు, ఉపాధి అవకాశాలపై దృష్టి సారించి ఉన్నత లక్ష్యాలను సాధించాలని సూచించారు.ఈ సందర్భంగా 30 మంది ఆటో డ్రైవర్లకు ప్రమాద సమయంలో ఉపయోగపడే ప్రథమ చికిత్స కిట్లను పంపిణీ చేశారు. ప్రమాదాల సమయంలో రక్తస్రావాన్ని నియంత్రించి ప్రాణాలను కాపాడడంలో ఈ కిట్లు ఎంతో ఉపయోగకరమని తెలిపారు.అదేవిధంగా తోషం, తోషం తాండా, రాగాపూర్, బోర్రమద్ది, పూనగూడ, తోయిగూడ గ్రామాలకు చెందిన ఆదివాసి యువత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని ఆకాంక్షిస్తూ ఐదు వాలీబాల్ కిట్లను అందజేశారు.గ్రామసభలో పాల్గొన్న సుమారు 200 మంది ప్రజలకు హెల్మెట్లను పంపిణీ చేసి, హెల్మెట్ ప్రాణ రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని వివరించారు. ప్రతి ఒక్కరూ ద్విచక్ర వాహనం నడిపే సమయంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. అలాగే కార్లలో ప్రయాణించే సమయంలో సీట్ బెల్ట్ తప్పనిసరిగా ధరించాలని తెలిపారు.అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ముగ్గుల పోటీలలో ప్రతిభ కనబరిచిన మహిళలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందజేశారు. రోడ్డు భద్రతపై కుటుంబ సభ్యుల్లో అవగాహన కల్పించడంలో మహిళల పాత్ర కీలకమని, వాహనాలు నడిపే వారు హెల్మెట్లు ధరించేలా ప్రోత్సహించాలని సూచించారు.యువతలో డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలనే సదుద్దేశంతో నిర్వహించిన డ్రైవింగ్ లైసెన్స్ మేళాలో పాల్గొన్న 75 మంది యువతకు లర్నింగ్ లైసెన్సులను అందజేశారు. ప్రతి వాహనదారుడు చెల్లుబాటు అయ్యే డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని సూచించారు. అలాగే గతంలో లొంగిపోయిన ముగ్గురు మావోయిస్టులకు ఇళ్ల పట్టాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో మల్టీజోన్-1 ఐజీ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్, జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఐఏఎస్, జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్, అదనపు ఎస్పీ (అడ్మిన్) పి. మౌనిక ఐపీఎస్, ఉట్నూర్ ఏఎస్పీ రుత్విక్ సాయి కొట్టే ఐపీఎస్, గ్రామ సర్పంచ్, గ్రామ పెద్దలు, ప్రజలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.



