పుష్కరాల పనులను వేగవంతం చేయాలి: కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి):
కాళేశ్వరంలో నిర్వహించనున్న అంత్య పుష్కరాల ఏర్పాట్ల పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. మంగళవారం జయశంకర్ భూపాలపల్లి ఐడిఓసి కార్యాలయంలో అంత్య పుష్కరాల ఏర్పాట్లపై రెవెన్యూ, పోలీస్, దేవాదాయ, పంచాయతీ రాజ్, ఇరిగేషన్, ఆర్ అండ్ బి, విద్యుత్, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంత్య పుష్కరాలకు చేపట్టిన అన్ని పనులు ఏప్రిల్ 30 లోగా మొత్తం పూర్తి చేయాలని ఆదేశించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి ఏర్పాట్లను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఘాట్ల వద్ద పరిశుభ్రత, తాగునీటి సౌకర్యం, విద్యుత్, తాత్కాలిక మరుగుదొడ్లు, పార్కింగ్ సదుపాయాలు, భక్తులు సురక్షితంగా స్నానం చేసేలా ఏర్పాట్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. పోలీస్ శాఖ ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వైద్య శాఖ అత్యవసర వైద్య సేవలు, అంబులెన్స్ సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని సూచించారు. సంబంధిత శాఖల అధికారులు పనుల పురోగతిని తరచూ పరిశీలిస్తూ సమయానికి పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, దేవాదాయ, ఇరిగేషన్, పీఆర్, ఆర్ అండ్ బి, విద్యుత్తు, మిషన్ భగీరథ, వైద్య, ప్రణాళిక, పోలీసు తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.



