రాజ్‌ పాకాలకు హైకోర్టులో ఊరట

 

జన్వాడలో జరిగిన విందు వ్యవహారంలో బీఆర్‌ఎస్‌ వరింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బావమరిది పాకాల రాజేంద్రప్రసాద్‌ (రాజ్‌పాకాల)కు సోమవారం హైకోర్టులో ఊరట లభించింది. పోలీసులు ఇచ్చిన నోటీసుల మేరకు విచారణకు హాజరయ్యేందుకు గడువు కావాలన్న పిటిషనర్‌ అభ్యర్థనకు కోర్టు సమ్మతించింది. రెండు రోజుల గడువు ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రతివాదులైన హోంశాఖ ముఖ్యకార్యదర్శి, సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌, మోకిల స్టేషన్‌హౌస్‌ ఆఫీసర్‌ (ఎస్‌హెచ్‌ఓ)/సబ్‌ఇన్‌స్పెక్టర్‌లను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి సోమవారం మధ్యంతర ఆదేశాలను జారీ చేశారు. తదుపరి విచారణను నవంబర్‌ 25కు వాయిదా వేశారు. ఏదైనా పార్టీలో డ్రగ్స్‌ వినియోగించిన వాళ్లు పట్టుబడితే వాళ్లకు చట్ట ప్రకారం పడే శిక్ష ఆరు మాసాలేనని, ఇలాంటి కేసుల్లో నోటీసులు జారీ చేయవచ్చు కదా అని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది.

నోటీసులపై స్పందించే వరకు చర్యలు వద్దు

సోమవారం ఉదయం 9.30కు నోటీసు అందజేసి అదే రోజు ఉదయం 11గంటలకు విచారణకు హాజరుకావాలంటే ఎలాగని హైకోర్టు పోలీసులను నిలదీసింది. ఈ చర్య నిష్పాక్షిక దర్యాప్తుపై సందేహాలు ఉన్నాయన్న పిటిషనర్‌ అభియోగాలకు బలం చేకూర్చడం లేదా అని ప్రశ్నించింది. అందుకే నోటీసుపై పిటిషనర్‌ స్పందించేదాకా ఆయనపై మోకిలా సీఐ, ఎస్సైలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోరాదని ఆదేశిస్తున్నామని వెల్లడించింది. ఉదయం కోర్టు ప్రారంభం కాగానే తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారణకు చేపట్టాలని రాజ్‌పాకాల తరఫు సీనియర్‌ న్యాయవాది మయూర్‌రెడ్డి కోరారు. భోజన విరామం తర్వాత విచారణకు న్యాయమూర్తి జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి అంగీకరించారు. పోలీసులు హడావుడిగా దర్యాప్తు చేసి కేసులో ఇరికించే కుట్ర జరుగుతుందంటూ మయూర్‌రెడ్డి ఆందోళనను పరిగణనలోకి తీసుకున్నారు.

తాజావార్తలు