ఇళ్ల స్థలాల కొనుగోలుకు అనుమతులిప్పించండి : మంత్రి తుమ్మలకు వినతి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (జనంసాక్షి) : జర్నలిస్టుల ఇళ్ల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ పాలకవర్గం – వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావుకు వినతి పత్రం అందించింది. సొసైటీ అధ్యక్షుడు బ్రహ్మాండభేరి గోపరాజు నాయకత్వంలో ఉపాధ్యక్షుడు ఎం. లక్ష్మి నారాయణ, ప్రధాన కార్యదర్శి రవీంద్ర బాబు, కోశాధికారి భీమగాని మహేశ్వర్ గౌడ్, డైరెక్టర్ కమలాకరా చార్య బుధవారం వ్యవసాయ, సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలసి జర్నలిస్టుల ఇండ్ల స్థలాలు – తాజా సుప్రింకోర్టు తీర్పు- ప్రస్తుత పరిస్థితులను విన్నవించారు. 1964 ఏర్పడిన జేసీహెచ్ఎస్ఎల్ ఇప్పటివరకూ మూడు కాలనీలను ఏర్పాటు చేసుకొని వందలామంది జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించిందని, మరో కాలనీ ఏర్పాటు కోసం 30 ఏళ్లుగా జర్నలిస్టులు ఎదురుచూస్తున్నారని మంత్రికి వివరించారు. అయితే ది జర్నలిస్టు కో ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీలో ఉన్న వెయ్యి మంది నాన్ అలాటిస్ జర్నలిస్టులకు ఇళ్ల నిర్మాణం కోసం స్థలం కొనుగోలు చెయ్యడానికి జనరల్ బాడీ సమావేశంలో తీర్మానం చేశామని చెప్పారు. ప్రస్తుతం కొంత సొసైటీ నిధులు, సభ్యుల నుంచి కూడా కొంత నిధులు సేకరించి స్థలం కోనుగోలు చేయాలన్న జనరల్ బాడీ తీర్మానించిన విషయాన్ని మంత్రి దృష్టికి అధ్యక్షుడు గోపరాజు తీసుకువచ్చారు. ఈ మేరకు సొసైటీ అధికారులకు దరఖాస్తు కూడా పెట్టుకున్నామన్నారు. వెయ్యిమంది నాన్ అలాటిస్ కోసం స్థలం కొనుగోలు చేసేందుకు సంబంధిత అధికారుల నుంచి అనుమతి ఇప్పించాలని మంత్రికి విజ్ఞప్తి చేశారు. హౌసింగ్ సొసైటీ లో ఉన్న వెయ్యి మంది జర్నలిస్టులకు న్యాయం చెయ్యాలని కోరారు. హౌసింగ్ సొసైటీలకు, జర్నలిస్టులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని, స్థలం కొనుగోలుకు సంబంధించి ఆధికారులకు ఆదేశాలు జారీ చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. మరోవైపు గోపనపల్లి, జూబిలీహిల్స్ లో ఉన్న జర్నలిస్టు కాలనీల్లో సొసైటీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి కూడా మంత్రికి వివరించారు. గోపనపల్లి జర్నలిస్టు కాలని ఫేజ్ త్రీ లో మంచినీటి, డ్రైనేజి కొత్త వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ఇటీవల మేనేజింగ్ కమిటీలో తీర్మానం చేసిన విషయాన్ని కూడా మంత్రి దృష్టికి తీసుకుని వెళ్ళారు. కో ఆపరేటివ్ నియమ నిబంధనల ప్రకారమే సొసైటీ పాలకమండలి ముందుకువెళ్తోందని మేనేజింగ్ కమిటీ తెలిపింది.