కాళేశ్వరంపై పూర్తి నిర్ధారణకు వచ్చాకే నివేదిక ఇస్తాం
` పలువురికి నోటీసులు ఇచ్చిన చంద్ర ఘోష్ కమిటీ
` విచారణకు రావాలని నిర్మాణ సంస్థలకు ఆదేశాలు
హైదరాబాద్(జనంసాక్షి):కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో జరిగిన అవకతవకలపై చంద్ర ఘోష్ కమిటీ విచారణ చేపట్టింది. తాజాగా ఈ విచారణను వేగవంతం చేసింది. ప్రాజెక్ట్‌ను ఇప్పటికే చంద్ర ఘోష్ కమిటీ సందర్శించింది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన పలు కీలక విషయాలపై ఈ కమిటీ దృష్టి సారించింది. కమిటీకి ఈ ప్రాజెక్ట్‌పై పలు ఫిర్యాదులు అందడంతో విచారణను ముమ్మరం చేసింది, విచారణకు సంబంధించిన పలు విషయాలనుసోమవారం విూడియాకు కాళేశ్వరం కమిషన్ చీఫ్ చంద్ర ఘోష్ వెల్లడిరచారు.విచారణ వేగవంతం చేసినట్లు తెలిపారు. సోమవారం 7 మందికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని అన్నారు. మంగళవారం 18 మంది విచారణకు రావాలని నోటీసులు ఇచ్చామని చెప్పారు. మొన్నటి వరకు తెలంగాణలో ఎలక్షన్ కోడ్ ఉందని.. అందుకే కొంత ఆలస్యం అవుతుందని అన్నారు. అన్ని విషయాలు రానున్న రోజుల్లో బయటకు వస్తాయని స్పష్టం చేశారు. విచారణకు వచ్చే అధికారులకు నోటీస్ ఇచ్చామన్నారు. ప్రాజెక్ట్ అవకతవకలపై 54 ఫిర్యాదులు వచ్చాయని.. విచారణ ముమ్మరం చేస్తామన్నారు. ఫిర్యాదులో నష్టపరిహారానికి సంబంధించినవి కూడా వచ్చాయని పేర్కొన్నారు. ప్రాజెక్ట్‌కు కట్టిన ఏజెన్సీలను విచారణకు రావాలని నోటీసులు జారీ చేశామని అన్నారు. నిజాలు తెలుసుకునేందుకు అందరి వద్దా ఉన్న సమాచారం తీసుకుంటున్నామని తెలిపారు. జూన్ 30వ తేదీ లోపు విచారణ పూర్తి కాదని.. ఇంకా సమయం పడుతుందని చెప్పారు. విచారణ వేగంగా జరుగుతుందని స్పష్టం చేశారు. అసలు విషయాలు, నిజాలు తెలుసుకోకుండా పూర్తి నివేదిక ఇవ్వలేనని అన్నారు. టెక్నికల్ అంశాల విచారణ పూర్తి అయ్యాక, రెగ్యూలర్, ఆర్థిక, అంశాలపై విచారణ మొదలు అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి రిపోర్టులు అన్ని అందాయని.. వాటి పరిశీలన జరుగుతుందని చంద్ర ఘోష్ పేర్కొన్నారు.