గొర్రెల మంద పైకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు

మెదక్ జిల్లా బ్యూరో, అక్టోబర్ 27 (జనం సాక్షి ):
* 20 గొర్రెలు హతం
* మరో ఏడు గొర్రెలు రెండు మేకలకు తీవ్ర గాయాలు
* బస్సు ప్రమాదం నుండి తృటిలో తప్పించుకున్న కాపరి అంజప్ప
* నారాయణపేట జిల్లాకు కురుమ నరసింహులు గొర్రెలుగా గుర్తింపు
* గాయపడిన గొర్రెలను తప్పించబోయి సైడ్ రీలింగ్ గుద్దుకున్న మరో డిసిఎం
ఆర్టీసీ బస్సు గొర్రెల మందపైకి దూసుకెల్లడంతో సుమారు 20 గొర్రెలు మృత్యువాత పడగా, మరో ఏడు గొర్రెలు, రెండు మేకలు తీవ్ర గాయాల పాలైన ఘటన మెదక్ జిల్లాలోని కొల్చారం పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. పోలీసులు స్థానికుల కథనం ప్రకారం… నారాయణపేట జిల్లా జాజాపూర్ గ్రామానికి చెందిన కురుమ నర్సింలుకు చెందిన గొర్రెల మందను పలువురు కాపరులు కౌడిపల్లి నుండి కొల్చారం మండలంలోని ఎడపాయలకు మేత కొరకు తోలుక పోతున్నారు. ఈ క్రమంలో జేబీఎస్ నుండి మెదక్ డిపోకు వెళుతున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు అతి వేగంగా వచ్చి మెదక్ హైదరాబాద్ జాతీయ రహదారిపై కొల్చారం శివారులోని చిన్న గుప్పడి కల్వర్టు వద్ద గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. దీంతో 20 గొర్రెలు బస్సు కిందపడి నుజ్జునుజ్జయి ప్రాణాలు కోల్పోగా, మరో ఏడు గొర్రెలు రెండు మేకలు తీవ్ర గాయాల పాలయ్యాయి. కాపరి అంజప్ప మంద వెనకాల నడుస్తూ వేగంగా దూసుకు వస్తున్న బస్సును గమనించి డ్రైవర్ కి చెయ్యి చూపిస్తూ ఆపమని సైగ చేసినా డ్రైవర్ అది గమనించకుండా స్పీడుగా బస్సును పోనిచ్చాడు. దీంతో అంజప్ప ఒక్క ఉదుటులో ప్రక్కకు దుంకి తృతిలో ప్రాణాలు రక్షించుకున్నాడు. ఇదిలా ఉండగా గాయపడిన గొర్రెలు రోడ్డుపై చెల్లాచెదురు పడి ఉండగా వెనకాలే వస్తున్న మరో డీసీఎం మూలమలుపు వద్ద ఒక్కసారిగా చచ్చి పడిఉన్న గొర్రెలను చూసి వాటిని తప్పించబోయి సైడ్ రీలింగుకు ఢీ కొట్టి అక్కడే ఆగిపోవడంతో మరో పెద్ద ప్రమాదం తప్పినట్లు అయింది. ఈ సందర్భంగా గొర్రెల కాపరులు మల్లేశం, అంజప్ప మాట్లాడుతూ తాము ప్రతి ఏడు మందలను తోలుకొని మెదక్ జిల్లాలోని ఏడుపాయల వరకు వచ్చి మేపుకొని తిరిగి వెళ్తామన్నారు. ఈ ఏడు ముందుగా పటాన్చెరులో కొన్ని రోజులు మేపి నర్సాపూర్ మీదుగా ఏడుపాయలవైపు వస్తున్నామన్నారు. ఈ ఘటనతో ఒక్కో గొర్రెకు 15 వేల చొప్పున సుమారు మూడు లక్షల వరకు నష్టపోయాం అన్నారు. ప్రభుత్వం తమను ఆదుకొని పరిహారం ఇప్పించాలని కోరారు. కాగా కొల్చారం ఎస్సై మొయినుద్దీన్ ఘటన స్థలానికి చేరుకుని ఘటనకు కారణమైన బస్సును పోలీస్ స్టేషన్కు తరలించారు. ఘటనపై పంచనామా నిర్వహించి, బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.



