ఎమ్మెల్యే స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం

జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు స్వగ్రామంలో సర్పంచ్ ఏకగ్రీవం అయింది. ఎమ్మెల్యే స్వగ్రామమైన గణపురం మండలం బుద్ధారం గ్రామంలో ఏ ఎన్నికలు జరిగినా తరచుగా ఘర్షణలు జరుగుతూ ఉండేవి. ఈ క్రమంలో గత రెండేళ్ల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భూపాలపల్లి ఎమ్మెల్యేగా సత్యనారాయణ రావు గెలుపొందారు. అప్పటినుండి బుద్ధారం గ్రామాన్ని అభివృద్ధి దిశగా చేసుకుంటూ వచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో గ్రామాన్ని ఏకగ్రీవం చేయాలని తపన నెలకొంది. దీంతో గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ విడుదల అశోక్ సతీమణి శ్రీలతకు సర్పంచ్ టికెట్ ను కేటాయించారు. అలాగే గ్రామానికి చెందిన కొమ్మురాజు అమృతమ్మ సర్పంచ్ పదవి ఆశించి నామినేషన్ దాఖలు చేయగా మూడు రోజుల అనంతరం తన నామినేషన్ ఉపసంహరించుకుంది. దింతో ఏకగ్రీవ సర్పంచ్ గా శ్రీలత ఎన్నికయ్యారు. అంతేకాక గ్రామంలో 12 వార్డులకు 9 వార్డులు ఒక్కరు చొప్పున నామినేషన్ దాఖలు చేయగా మరో మూడు వార్డులు రేపు ఉపసంహరణ కానున్నాయి. ఎమ్మెల్యే స్వగ్రామం ఏకగ్రీవం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.