మాడుగులపల్లి రోడ్లపై నరక దర్శనం గ్రామాలకు వెళ్లాలంటేనే వణుకు

 

 

 

 

 

మండల కేంద్రం నుండి గ్రామాలకు వెళ్లే దారిలో అగాధాల్లాంటి గుంతలు

200 మీటర్ల రోడ్డును పట్టించుకోని పాలకులు ప్రమాదాలకు నిలయం

వడ్ల లోడు ట్రాక్టర్లు పల్టీ కొట్టే ప్రమాదం ప్రాణభయంతో రైతుల ప్రయాణం

మాడుగులపల్లి, మార్చి 26 ( జనం సాక్షి):

మాడుగులపల్లి మండల కేంద్రం నుండి వివిధ గ్రామాలకు వెళ్లే ప్రధాన రహదారి ప్రస్తుతం మృత్యుపాశంలా మారింది మండల కేంద్రం నుండి చెరువుపల్లి, దాచారం, నారాయణపురం, కన్నెకల్లు వంటి గ్రామాలకు వెళ్లే దారిలో సుమారు 200 మీటర్ల మేర రోడ్డు పూర్తిగా ధ్వంసమై అడుగుడుగునా లోతైన గుంతలు ఏర్పడ్డాయి. నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగించే ఈ మార్గంలో ప్రయాణించాలంటేనే వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు.
ప్రాణసంకటంగా మారిన వడ్ల రవాణా
ప్రస్తుతం వడ్ల కొనుగోళ్ల సీజన్ కావడంతో, రైతులు తమ పంటను ట్రాక్టర్లలో లోడు చేసుకుని గ్రామాలనుండి మండల కేంద్రానికి వస్తున్నారు. అయితే, ఈ 200 మీటర్ల అధ్వానపు రోడ్డుపై లోడుతో ఉన్న ట్రాక్టర్లు వెళ్లడం ప్రాణసంకటంగా మారింది గుంతలు ఎంత లోతుగా ఉన్నాయంటే ఏ క్షణంలో ట్రాక్టర్ పల్టీ కొడుతుందో తెలియడం లేదు. ఎంతో కష్టపడి పండించిన పంట రోడ్డుపాలవుతుందేమోనని భయంగా ఉంది అని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికారుల నిర్లక్ష్యంపై నిప్పులు
మండల కేంద్రం నుంచి గ్రామాలకు అనుసంధానంగా ఉన్న ఈ కీలక రహదారిని కనీసం పట్టించుకోకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నిత్యం అధికారులు, ప్రజాప్రతినిధులు ఇదే దారిలో తిరుగుతున్నా, కనీసం గుంతలు పూడ్చే నాథుడే కరువయ్యారని మండిపడుతున్నారు. ద్విచక్ర వాహనదారులు రాత్రి వేళల్లో ఈ గుంతలు కనిపించక పడిపోయి తీవ్ర గాయాలపాలవుతున్నారు.
గ్రామస్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, అధికారులు ఇప్పటికైనా నిద్ర మత్తు వదిలి యుద్ధ ప్రాతిపదికన ఈ 200 మీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వడ్ల సీజన్ పూర్తయ్యేలోపు శాశ్వత పరిష్కారం చూపకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని గ్రామస్తులు హెచ్చరిస్తున్నారు.

తాజావార్తలు