స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాద

– పదవి అంటే అధికారం కాదు… బాధ్యత అని చాటి చెప్పిన దార్శనికుడు
— దుద్దిళ్ల శ్రీపాద రావు విలువల రాజకీయం… నేటి తరానికి స్ఫూర్తిదాయకం
— కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్
మంథని, ( జనంసాక్షి ) : స్పీకర్ వ్యవస్థకే వన్నె తెచ్చిన విలువల శిఖరం శ్రీపాదరావు అని కర్ణాటక స్పీకర్ యూటీ ఖాదర్ ఫరీద్ కొనియాడారు. రాజకీయాల్లో పదవి అనేది నెత్తిన పెట్టుకునే కిరీటం కాదు, అది బాధ్యత అని చాటిచెప్పిన దార్శనికుడన్నారు. సోమవారం రాత్రి హైటెక్ సిటీలోని శిల్పాకళా వేదికలో తెలంగాణ భాషా, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాద రావు 89వ జయంతి వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా యూటీ ఖాదర్ ఫరీద్ మాట్లాడుతూ.. సర్పంచ్ నుంచి స్పీకర్ వరకు ఎదిగిన శ్రీపాద రావు రాజకీయ ప్రస్థానం ఎంతో స్ఫూర్తిదాయకమన్నారు. ప్రజాస్వామ్యంలో జవాబుదారీతనం లేకపోతే అది అధికారం అవుతుంది తప్ప సేవ కాదని బలంగా విశ్వసించారన్నారు. చివరి వరకూ… ప్రజా సేవే శ్వాసగా విలువలతో కూడిన రాజకీయం చేశారన్నారు. ప్రజాప్రతినిధి సరిగ్గా పనిచేయకపోతే వెనక్కి పిలిచే “రీకాల్” విధానాన్ని మనస్ఫూర్తిగా సమర్థించిన గొప్ప ప్రజాస్వామ్యవాది శ్రీపాద రావు అని అన్నారు. స్పీకర్‌గా ఉన్నప్పుడు అధికార, ప్రతిపక్షాలకు సమాన అవకాశం కల్పించి ప్రజాస్వామ్య విలువల్ని కాపాడారన్నారు. ఒక నాయకుడు ఎలా బతకాలో మాత్రమే కాదు, చనిపోయిన తర్వాత కూడా ప్రజల గుండెల్లో ఎలా బతికి ఉండాలో నిరూపించిన ధన్యజీవన్నారు. రాజకీయాల్లో నైతికత, పార్లమెంటరీ విలువలు ప్రశ్నార్థకమవుతున్న ప్రస్తుత తరుణంలో ఇలాంటి మహనీయులు చూపిన అనుసరణీయమన్నారు. సభాపతి హోదాలో ఆయన నెలకొల్పిన ప్రమాణాలు నేటి తరుణంలో ఆచరించాల్సిన అవసరం ఉందన్నారు. అధికారం ఉన్నా లేకున్నా ప్రజల కోసం ఆయన పడిన తపన… నేటి తరం నాయకులకు ఒక పాఠ్యపుస్తకమన్నారు. శ్రీపాదరావు కేవలం చట్టసభకే పరిమితం కాలేదని, సామాజిక ఉద్రిక్తతలు నెలకొన్న సమయంలో కూడా అమాయకులను రక్షించేందుకు రాజ్యాంగ పరిధిలో ఉండి ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన చూపిన విలువల బాటలో పయనిస్తూ, తండ్రికి తగ్గ తనయుడిగా, నిబద్ధత గల నాయకుడిగా మంత్రి శ్రీధర్ బాబు ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారని ప్రశంసించారు. ఇదే స్ఫూర్తిని రాబోయే రోజుల్లోనూ కొనసాగించాలని సూచించారు. తండ్రి శ్రీపాద రావు ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి — రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు “ప్రజా క్షేత్రంలో సాటి మనిషి కోసం ఎలా నిలబడాలి, కష్టాల్లో ఉన్నవారికి ఎలా అండగా నిలవాలనే నైతిక విలువల్ని మా నాన్న మాకు వారసత్వంగా ఇచ్చారని స్వర్గీయ శ్రీపాదరావు తనయుడు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. తనను నమ్ముకున్న ఒక సామాన్య కార్యకర్త ఇంటికి వెళ్తూ, ప్రజల మధ్యే ఆయన అమరుడు అయ్యారని గుర్తు చేశారు. తన ఊపిరి ఆగిపోయే వరకు ప్రతి అడుగు ప్రజల కోసమే వేశారు అని పేర్కొన్నారు. ఆయన ఆశయ సాధనకు చిత్తశుద్ధితో కృషి చేస్తానని, అదే నిబద్ధతతో ప్రజా సేవలో ముందుకు సాగుతానన్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, వైస్ చైర్మన్ బండా ప్రకాశ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్, అజారుద్దీన్, ఎమ్మెల్యేలు విజయ రమణా రావు, రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్, ఆది శ్రీనివాస్, ప్రేమ్ సాగర్ రావు, గండ్ర సత్యనారాయణ, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, అరికెపూడి గాంధీ, మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణిదేవి, బల్మూరి వెంకట్ తదితరులు పాల్గొన్నారు.



