మండుతున్న ఎండలు, వడదెబ్బ తగలకుండా తీసుకోవల్సిన జాగ్రత్తలివే!!!

వేసవి పీక్స్‌లో ఉంది. రోహిణి కార్తె ప్రారంభమైంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తాంధ్ర జిల్లాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వడగాల్పుల తీవ్రత పెరిగింది. మరి వడదెబ్బ తగలకుండా ఏం జాగ్రత్తలు తీసుకోవాలో పరిశీలిద్దాం..

వేసవి చరమస్థాయిలో ఉంది. గత 3-4 రోజులుగా ఎండలు మండిపోతున్నాయి. పగటి ఉష్ణోగ్రత భారీగా పెరిగిపోతోంది. రికార్డు స్థాయిలో రాజమండ్రిలో 48 డిగ్రీలు నమోదైంది. వరుసగా రెండ్రోజులు 46 డిగ్రీల ఉష్ణోగ్రత చేరుకుంది. తెలుగు రాష్టాల్లో ముఖ్యంగా కోస్తాంధ్రలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. వడగాల్పుల తీవ్రత అధికమైంది. ఈ క్రమంలో ఆరోగ్యాన్ని కాపాడుకోవల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా వడదెబ్బ తగలకుండా ఏం చేయాలనేది వైద్య నిపుణులు కొన్ని ముఖ్యమైన సూచనలు జారీ చేశారు.

వేసవికాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ముందుగా బాడీ డీ హైడ్రేట్ కాకుండా చూసుకోవాలి. దీనికోసం ఎక్కువగా లిక్విడ్ ఫుడ్స్ అలవాటు చేసుకోవాలి. దాంతోపాటు శరీరంలో వేడి పెరగకుండా చూసుకోవాలి. వేసవిలో తీసుకోవల్సిన పానీయాలు చాలానే ఉన్నాయి. ద్రవ పదార్ధాల్ని సాధ్యమైనంత ఎక్కువ తీసుకోవడం ద్వారా ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవచ్చంటున్నారు.

వేసవిలో ప్రధానంగా తీసుకోవల్సింది పుచ్చకాయలు. ఇవి ఆరోగ్యానికి చాలా మంచివి. ఇందులో నీటి శాతం ఎక్కువ కావడం వల్ల డీహైడ్రేషన్ సమస్య పోతుంది. ఇందులో విటమిన్ ఎ, సి, బి6, లైకోపిన్, అమైనో యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. కేలరీలు తక్కువగా ఉండటం వల్ల డైటింగ్‌కు ఇబ్బంది ఉండదు.

ఇక కొన్ని ప్రాంతాల్లోనే లభించే తాటి ముంజలు. ఇందులో జింక్, మెగ్నీషియం, ఐరన్, కాపర్,సెలీనియం వంటి పోషక పదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చేస్తాయి. మరీ ముఖ్యంగా ఒంట్లో వేడి తగ్గుతుంది. ఫలితంగా మలబద్ధకం సమస్య పోతుంది.

కీరా వేసవిలో తప్పకుండా అలవాటు చేసుకోవాలి. నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల శరీరమంతా హైడ్రేట్‌గా ఉంటుంది. శరీరంలో ఉండే విషపదార్ధాలు బయటకుపోవడం వల్ల చర్మం కాంతివంతంగా ఉంటుంది. ఇక మరో ముఖ్యమైన పండు ద్రాక్ష. ఇందులో మినరల్స్, విటమిన్లు పుష్కలంగా ఉండటం వల్ల వడదెబ్బ నుంచి రక్షించుకోవచ్చు. ఇది శరీరానికి చలవ చేస్తుంది. సపోటా పండ్లు కూడా వేసవిలో ఆరోగ్యానికి మేలు చేకూరుస్తాయి. కేవలం నీటిశాతాన్ని పరిరక్షించడమే కాకుండా ఎనర్జీ లభిస్తుంది.

వీటితో పాటు కొబ్బరి నీళ్లు, మజ్జిగ, బార్లీ వంటి ద్రవ పదార్ధాల్ని ప్రతిరోజూ క్రమం తప్పకుండా తీసుకుంటూ ఉంటే బాడీ ఎప్పుడూ హైడ్రేట్‌గా ఉంటుంది. వడదెబ్బ నుంచి కాపాడుకోవచ్చు.