నేడు తెలంగాణలోని 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం
రాష్ట్రంలో బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. మొత్తం 16 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఉమ్మడి ఆదిలాబాద్, వరంగల్, ఖమ్మం, మహబూబ్‌నగర్, రంగారెడ్డి జిల్లాల్లో ఈదురు గాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని తెలిపింది. అదేవిధంగా గురువారం కూడా ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, మెదక్, రంగారెడ్డి జిల్లాల్లో పలుచోట్ల ఓ మోస్తరు వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. కాగా మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు పడ్డాయి.
అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారంలో 6.9 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదైంది. సిద్దిపేట జిల్లా తొగుట మండలం వెంకట్రావ్‌పేటలో 6.5 సెంటీ మీటర్లు, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మేడిపల్లి మండలం పీర్జాదిగూడలో 6.5 సెంటీ మీటర్లు, మెదక్ జిల్లా ఎల్దుర్తిలో 6 సెంటీ మీటర్లు, తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌లో 5.8 సెంటీ మీటర్లు, శంకరంపేటలో 5.1 సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది. పిడుగుపాటుకు సిద్దిపేట జిల్లాలో ఓ రైతు, మెదక్ జిల్లాలో ఓ మహిళ మృతిచెందారు.
సిద్దిపేట జిల్లా తొగుట మండలం జప్తిలింగారెడ్డిపల్లికి చెందిన రైతు కడారి శ్రీశైలం (45) మంగళవారం సాయంత్రం పొలంలో పనిచేస్తుండగా వర్షం కురవడంతో సమీపంలోని చెట్టు కిందకు వెళ్లారు. అదే సమయంలో పిడుగుపడటంతో అపస్మారక స్థితికి చేరారు. వెంటనే సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. మెదక్ జిల్లా చిల్పచేడు మండలం సోమక్కపేట గంగిరెద్దులగూడకు చెందిన ఎల్లమ్మ (45) గ్రామ శివారులో నడుచుకుంటూ వెళ్తుండగా పిడుగుపడడంతో అక్కడికక్కడే మృతిచెందారు.