41 ఏళ్ల క్రియేటివ్ ప్రయాణానికి ముగింపు
ఆగస్టు25 (జనం సాక్షి):భారత సినిమా పరిశ్రమలో విలక్షణమైన హాస్యాన్ని, సున్నితమైన కథనాలను తెరపై ఆవిష్కరించిన ప్రఖ్యాత దర్శకుడు ప్రియదర్శన్ తన డైరెక్షన్ కెరీర్‌కు వీడ్కోలు పలకనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. 41 ఏళ్ల సినిమాటిక్ ప్రయాణం తర్వాత తన 100వ చిత్రంతో దర్శకత్వం నుంచి రిటైర్మెంట్ తీసుకుంటున్నట్టు తెలిపారు. మలయాళంలో రచయితగా, దర్శకుడిగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన ప్రియదర్శన్, హిందీ సినిమాలలో ‘హేరా ఫేరీ’, ‘భూల్ భులయ్యా’, ‘హంగామా’ వంటి అద్భుత హాస్య చిత్రాలతో స్టార్ డైరెక్టర్‌గా ఎదిగారు. తెలుగులోనూ అక్కినేని నాగార్జునతో ‘నిర్ణయం’, నందమూరి బాలకృష్ణతో ‘గాంఢీవం’ చిత్రాలు తెరకెక్కించారు.
ప్రస్తుతం అక్షయ్ కుమార్, పరేష్ రావల్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో రూపొందుతున్న ‘హేరా ఫేరీ 3’ సినిమాను ప్రియదర్శన్ డైరెక్ట్ చేస్తున్నారు. అలాగే, అక్షయ్ కుమార్‌తో కలిసి ఆయన ‘ఒప్పం’ హిందీ రీమేక్ ‘హైవాన్’ తెరకెక్కిస్తున్నారు. ఈ రెండు సినిమాల తర్వాత, తన 100వ సినిమాగా మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌తో కలిసి ఒక చిత్రం చేయనున్నట్టు చెప్పారు.“మొదటి సినిమా నుంచి ఇప్పటివరకు 41 ఏళ్లు గడిచిపోయాయి. డైరెక్షన్ పరంగా నేను పూర్తిగా అలసిపోయాను. నా 100వ సినిమాతో ఈ ప్రయాణానికి ముగింపు పలికే సమయం వచ్చింది” అని ప్రియదర్శన్ ప్రకటించారు.
ప్రియదర్శన్ కూతురు కల్యాణీ ప్రియదర్శన్ ఇప్పటికే దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ‘హలో’, ‘చిత్రలహరి’, ‘రణరంగం’ వంటి సినిమాల్లో నటించిన కల్యాణీ, ఇప్పుడు నస్లేన్ హీరోగా ‘లోకా ఛాప్టర్ 1: చంద్ర’ అనే చిత్రంలో నటించింది. ఈ సినిమా ఆగస్టు 28న విడుదల కానుంది. మరి కొద్ది రోజులలో కూతురి సినిమా విడుదల కానుండగా, ఈ సమయంలో ప్రియదర్శన్ రిటైర్మెంట్ ప్రకటన కొందరిని భావోద్వేగానికి గురి చేస్తుంది. అద్భుతమైన హాస్యం, క్లాసిక్ కథలు, హ్యూమన్ ఎమోషన్స్‌తో అద్భుత చిత్రాలను అందించిన ప్రియదర్శన్… ఇండియన్ సినిమా అభిమానుల గుండెల్లో ఎన్నటికీ చిరస్థాయిగా నిలిచిపోతారు.