ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ పనులతో ట్రాఫిక్ తిప్పలు

 

ఉప్పల్, మే 26 (జనం సాక్షి): ఉప్పల్ – నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు అమలు చేస్తున్న డైవర్షన్లు స్థానిక కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులను కలిగిస్తున్నాయి. ప్రధాన రహదారులపై ట్రాఫిక్‌ను తగ్గించేందుకు వాహనాలను అంతర్గత కాలనీ రోడ్ల వైపు మళ్లించడం వల్ల ఇప్పుడు ప్రశాంతంగా ఉండే నివాస ప్రాంతాలు భారీ ట్రాఫిక్ రద్దీతో నిండిపోతున్నాయి.ప్రస్తుతం ఉప్పల్ ఎక్స్ రోడ్స్ పరిసరాలతో పాటు చిలకనగర్ ప్రాంతంలోని బీరప్పగడ్డ లైన్, సర్వే ఆఫ్ ఇండియా రోడ్, లక్ష్మారెడ్డి కాలనీ, పాత సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం లేన్, నల్లచెరువు రోడ్ల గుండా సుమారు 50 నుంచి 60 శాతం వరకు ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. దీనివల్ల కాలనీల్లో రోజు మొత్తం వాహనాల రద్దీ కొనసాగుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.స్థానికుల వివరాల ప్రకారం, గతంలో ఉప్పల్ నుంచి బోడుప్పల్ చేరేందుకు ఐదు నిమిషాల సమయం మాత్రమే పట్టేదని, ప్రస్తుతం కాలనీ రోడ్ల గుండా ప్రయాణించాల్సి రావడంతో 15 నుంచి 20 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడుతోందని వాహనదారులు వాపోతున్నారు. ఉదయం 6 గంటల నుంచే తార్నాక, నాగోల్ వైపు వెళ్లే అంతర్గత రహదారులపై భారీగా వాహనాలు నిలిచిపోతుండటంతో ఉద్యోగులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.మరోవైపు కొంతమంది వాహనదారులు ట్రాఫిక్ నుంచి బయటపడేందుకు రాంగ్ రూట్‌లో ప్రయాణించడం పరిస్థితిని మరింత క్లిష్టంగా మారుస్తోంది. చిన్న చిన్న కాలనీ వీధుల్లో కూడా కార్లు, ఆటోలు, భారీ వాహనాలు వెళ్లడం వల్ల పాదచారులు భయాందోళనకు గురవుతున్నారు. పిల్లలు, వృద్ధులు రోడ్లు దాటేందుకు కూడా ఇబ్బంది పడుతున్నట్లు కాలనీవాసులు చెబుతున్నారు.ఇక ఉప్పల్ ప్రధాన రహదారిపై ట్రాఫిక్ జాప్యం అధికంగా ఉండటంతో చాలా మంది వాహనదారులు గూగుల్ మ్యాప్స్ సూచనల ఆధారంగా హబ్సిగూడ – నాచారం – ఎన్‌ఎఫ్‌సి మార్గాన్ని ప్రత్యామ్నాయంగా ఎంచుకుంటున్నారు. దీనివల్ల హబ్సిగూడ, నాచారం పరిసర ప్రాంతాల్లోని అంతర్గత రోడ్లపై కూడా వాహనాల ఒత్తిడి విపరీతంగా పెరిగింది.స్థానిక వ్యాపారులు మాట్లాడుతూ, నిరంతర ట్రాఫిక్ రద్దీ కారణంగా దుకాణాల వద్దకు కస్టమర్లు రావడం తగ్గిపోయిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ సమస్యలు అధికమవడంతో వ్యాపారాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని చెబుతున్నారు.కాలనీవాసులు మరియు వాహనదారులు ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యామ్నాయ ప్రణాళికలు అమలు చేయాలని, ముఖ్యంగా నివాస ప్రాంతాల్లో భారీ వాహనాల ప్రవేశాన్ని నియంత్రించాలని డిమాండ్ చేస్తున్నారు. ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తయ్యే వరకు ప్రత్యేక ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చర్యలు తీసుకోకపోతే పరిస్థితి మరింత దారుణంగా మారే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.