యాప్‌లో యూరియా బుకింగ్.. రైతులకు మాత్రం తిప్పలే తిప్పలు!
“30 సెకన్లలో స్టాక్ ఖాళీ.. యాప్‌పై రైతుల ఆవేదన అనుమానాలు”
“పొలంలో పనులా.. యాప్ ముందు కాపలా కాయాలా?”
సిరికొండ, జూన్ 11(జనం సాక్షి ): ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో యూరియా కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎరువుల దుకాణాలకు వెళ్లి నేరుగా యూరియా కొనుగోలు చేసుకునే రైతులు, ప్రస్తుతం యాప్ ఆధారిత బుకింగ్ విధానం కారణంగా నానా తంటాలు పడుతున్నారు. యూరియా బస్తా కోసం ఉదయం 5:30 గంటలకే నిద్రలేచి, 5:59 గంటల నుంచే ఫర్టిలైజర్ యాప్‌లో లాగిన్ అయి స్టాక్ కోసం ఎదురుచూస్తున్నాఉదయం 6 గంటలకు మండలాన్ని ఎంపిక చేసి డీలర్ల వద్ద ఉన్న స్టాక్‌ను పరిశీలించి బుకింగ్ చేసేందుకు ప్రయత్నిస్తుంటే, ప్రతి నలుగురు రైతుల్లో ఒకరికి మాత్రమే బుకింగ్ విజయవంతమవుతోందని, మిగిలిన ముగ్గురు రైతులకు “బుకింగ్ ఫెయిల్” లేదా “స్టాక్ అందుబాటులో లేదు” అనే సందేశాలు వస్తున్నాయని రైతులు వాపోతున్నారు. బుకింగ్ చూపించినా చివరి దశలో విఫలమవడం, సర్వర్ సమస్యలు, సాంకేతిక లోపాలతో రైతులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు.రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ, “యాప్‌లో స్టాక్ కనిపించిన వెంటనే బుకింగ్‌కు ప్రయత్నిస్తే కేవలం 20 నుంచి 30 సెకన్ల వ్యవధిలోనే యూరియా బస్తాలు పూర్తిగా అయిపోయినట్లు చూపిస్తోంది. ఇంత తక్కువ సమయంలో అంత స్టాక్ ఎలా బుక్ అవుతుందో అర్థం కావడం లేదు. బుకింగ్ కోసం ఉదయం నుంచే ఎదురుచూసినా చివరికి నిరాశే మిగులుతోంది” అని తెలిపారు.మొదటి దఫా యూరియా అవసరాలకే రైతులు ఇంత ఇబ్బందులు పడాల్సి వస్తే, వ్యవసాయ పనులు పూర్తిస్థాయిలో ప్రారంభమైన తర్వాత పరిస్థితి మరింత క్లిష్టంగా మారుతుందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పొలాల్లో పనులు వదిలి ప్రతిరోజూ యాప్ ముందు కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.బుకింగ్ పొందిన రైతులు సంతోషంగా యూరియా తీసుకెళ్తుంటే, బుకింగ్ దక్కని రైతులు మాత్రం మరో రోజు కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. వ్యవసాయ పనులు కీలక దశలో ఉన్న సమయంలో యూరియా అందకపోవడంతో పంటలపై ప్రభావం పడుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
రైతులు మాట్లాడుతూ, “ఇలా సాంకేతిక సమస్యలు, బుకింగ్ ఆటంకాలతో రైతులను ఇబ్బందులకు గురి చేయడం కంటే వ్యవసాయం చేయొద్దని నేరుగా చెప్పడమే మేలు. రైతుల సమయం, శ్రమ వృథా కాకుండా గతంలో మాదిరిగా సొసైటీల ద్వారా లేదా సులభమైన విధానంలో యూరియా పంపిణీ చేయాలి” అని డిమాండ్ చేస్తున్నారు.
వ్యవసాయ శాఖ అధికారులు యాప్‌లో ఉన్న సాంకేతిక సమస్యలను పరిష్కరించి, రైతులందరికీ సులభంగా యూరియా అందేలా చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. ప్రస్తుతం యూరియా కోసం రైతులు పడుతున్న ఇబ్బందులు వ్యవసాయ రంగంలో చర్చనీయాంశంగా మారాయి.



