అమిత్‌ షాకు కౌంటర్‌ ఇచ్చిన ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బీఎస్‌ రెడ్డి

న్యూఢిల్లీ, ఆగస్ట్‌ 23 (జనంసాక్షి) : సుప్రీం కోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పులను వ్యక్తిగతంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఆపాదించడంపై ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి జస్టిస్‌ బి సుదర్శన్‌ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సుప్రీం కోర్టు జడ్జిగా ఇచ్చిన తీర్పు వ్యక్తిగత హోదాను కలిపి మాట్లాడటం పట్ల కనీస మర్యాద కాదన్నారు. డిబెట్‌లో డీసెన్సీ ఉండాలన్నారు. ప్రత్యర్థులపై తాను వ్యక్తిగత విమర్శలు చేయబోనని ముందే ప్రకటించానని ఈ సందర్భంగా సుదర్శన్‌ రెడ్డి గుర్తుచేశారు. ఉపరాష్ట్రపతి ఎన్నికలను రెండు వ్యక్తుల మధ్య పోటీగా చూడరాదని, రెండు సిద్ధాంతాల మధ్య పోటీగానే చూడాలని సుదర్శన్‌ రెడ్డి పేర్కొన్నారు. “కేంద్ర హోంమంత్రితో ఈ విషయంపై నేరుగా చర్చకు దిగాలని అనుకోవడం లేదు. గతంలో ఆ తీర్పు నేనే రాశా. కానీ, అది నా తీర్పు కాదు, సుప్రీం కోర్టుది. 40 పేజీల ఆ తీర్పును అమిత్ షా చదవాలని ఆశిస్తున్నా. ఒకవేళ అది చదివి ఉంటే ఆ వ్యాఖ్యలు చేసి ఉండేవారు కాదు” అని జస్టిస్ పేర్కొన్నారు.