సన్నబియ్యం పంపిణీతో కడుపు నిండా అన్నం అందిస్తున్నాం..

– ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు
జయశంకర్ భూపాలపల్లి బ్యూరో, (జనంసాక్షి): సన్నబియ్యం పంపిణీతో కడుపు నిండా అన్నం అందిస్తున్నామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. భూపాలపల్లి మండలం మోరంచపల్లి గ్రామంలో ఆదివారం నూతన రేషన్ దుకాణ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై రిబ్బన్ కత్తిరించి దుకాణాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు సన్నబియ్యం పంపిణీ చేస్తే ప్రభుత్వ ఖజానాపై భారం పడుతుందని చెప్పి లబ్ధిదారులను మోసం చేసిందని ఆరోపించారు. నాణ్యత లేని దొడ్డు బియ్యాన్ని మాత్రమే ఇచ్చి పేదలను మోసగించారని విమర్శించారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి నాణ్యమైన సన్నబియ్యం అందేలా పంపిణీ కార్యక్రమాన్ని సమర్థంగా అమలు చేస్తోందని తెలిపారు.
ప్రజల ఆహార భద్రతే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, సంక్షేమ పథకాల ఫలాలు మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా ప్రతి అర్హుడికి చేరేలా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి ఆర్డీఓ హరికృష్ణ, స్థానిక సర్పంచ్ నరెడ్ల తిరుపతి రెడ్డి, రేషన్ దుకాణ నిర్వాహకులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



