సీఐటీయూ వ్యవస్థాపకుల ఆశయాలను సాధిస్తాం: రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్
జడ్చర్ల, మే 30 (జనంసాక్షి): సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ (సీఐటీయూ) వ్యవస్థాపకులు బీటీ రణదీవే, రామ్మూర్తి ఆశయాలను నిరంతరం కొనసాగిస్తామని, కార్మికుల హక్కుల కోసం రాజీలేని పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ పిలుపునిచ్చారు. శనివారం జడ్చర్ల మున్సిపల్ కార్యాలయం ముందు సీఐటీయూ 56వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. కృష్ణ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐటీయూ పట్టణ కమిటీ అధ్యక్షురాలు ఇందిరమ్మ సంఘం జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర కార్యదర్శి ఆకుల వెంకటేష్ మాట్లాడుతూ 1970కి ముందు ఏఐటీయూసీ లోని అప్పటి నాయకత్వం కార్మికుల పోరాటాలను పక్కనపెట్టి, పాలకులతో రాజీపడే ధోరణిని అవలంబించిందని గుర్తు చేశారు. ఆ ధోరణిని వ్యతిరేకిస్తూ బీటీ రణదీవే, రామ్మూర్తి గారలు 1970 మే 28న సీఐటీయూను స్థాపించారని తెలిపారు. ఆనాటి నుండి నేటి వరకు అన్ని వర్గాల కార్మికులను ఏకం చేస్తూ, పోరాట స్ఫూర్తితో కార్మికుల పక్షాన నిలబడిన ఏకైక సంఘం సీఐటీయూ అని కొనియాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ, ఉన్న చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్‌గా మార్చి కార్మికులకు తీరని అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. కేంద్రం తెచ్చిన ఈ నాలుగు లేబర్ కోడ్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో వ్యతిరేకిస్తూ తక్షణమే తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే. కృష్ణ, ఉపాధ్యక్షులు అంజమ్మ, జంగయ్య, కరీమ్, గిద్ద శంకర్ లు మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఎన్నో ఏళ్లుగా పనిచేస్తున్న తమకు “సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం నియమించిన 2వ పీఆర్సీలో కనీస వేతనం రూ. 26 వేలు అమలు చేయాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. అమరుల ఆశయ సాధన కోసం, హక్కుల రక్షణ కోసం సీఐటీయూ జెండా కింద కార్మికులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో కార్మికులు జంగమ్మ, లక్ష్మమ్మ, స్వరూప, కొండమ్మ, నాగసాల వెంకటమ్మ, జయమ్మ, కేశవులు, వాటర్ మాన్ వెంకటయ్య, బాలస్వామి, డ్రైవర్ జంగయ్య, కిరణ్, వెంకటేష్, నరేష్ తదితరులు పాల్గొన్నారు.



