అన్నం, కూర అడిగితే మోకాళ్లపై కూర్చోబెట్టారు

నల్లగొండ ప్రతినిధి, మార్చి 31,జనం సాక్షి:

నల్గొండ జిల్లా దామరచర్లలోని బీసీ గురుకుల పాఠశాలలో విద్యార్థినులపై ప్రిన్సిపాల్ అమానుషంగా ప్రవర్తించిన ఘటన కలకలం రేపుతోంది.అన్నం సరిపోలేదని మరికొంత ఇవ్వాలని అడిగిన విద్యార్థినులపై ప్రిన్సిపాల్ దాష్టికంగా వ్యవహరించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.వివరాల ప్రకారం, రాత్రి సుమారు 8 గంటల నుండి 9 గంటల వరకు విద్యార్థినులను మోకాళ్లపై కూర్చోబెట్టి శిక్షించినట్లు సమాచారం. ఎక్కువ అన్నం, ఎక్కువ కూరలు పెట్టలేము అంటూ బెదిరింపులకు దిగడంతో పాటు, మళ్లీ అన్నం అడిగితే అందరికీ ఇదే గతి అని హెచ్చరించినట్లు విద్యార్థినులు చెబుతున్నారు.ఈ ఘటనతో విద్యార్థినులను చిత్రహింసలకు గురిచేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే ఈ అంశంపై స్పందన కోసం సంప్రదించిన ఆర్‌సీఓ స్వప్న అందుబాటులోకి రాకపోవడం శోచనీయం.ఇక ఘటనపై విద్యార్థి సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సంబంధిత ప్రిన్సిపాల్‌ను వెంటనే డిస్మిస్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.