విద్యార్థి సంఘాల ప్రవేశంతో ఇథనాల్‌ వ్యతిరేక పోరాటం ఉధృతం..!

రాజోలి (జనంసాక్షి) : ఇథనాల్‌ ఫ్యాక్టరీ రద్దు కోసం రాజోలి మండలం పెద్ద ధన్వాడలో కొనసాగిస్తున్న ఉద్యమం ఉధృతం రూపం దాలుస్తోంది. వరుసగా వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, యువకులు, గ్రామాలు, మేధావులు, విద్యావంతులు రిలే దీక్షలకు మద్దతు తెలుపుతుండగా.. తాజాగా విద్యార్థి సంఘాల ప్రవేశంతో పోరు మరింత ఉధృమవుతోంది. 16వ రోజు సందర్భంగా శుక్రవారం రోజున పాలమూరు వర్శిటీకి చెందిన ప్రధాన సంఘాలు బీఆర్‌ఎస్వీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఏబీవీపీ సంఘాలు రిలే దీక్షలకు మద్దతు ప్రకటించాయి. ఈ సందర్భంగా పాలమూరు వర్సిటీ బీఆర్‌ఎస్‌వీ కన్వీనర్‌ గడ్డం భరత్‌ బాబు, పీయూ ఎస్‌ఎఫ్‌ఐ ప్రెసిడెంట్‌ రామకృష్ణ గౌడ్‌, పీయూ ఏబీవీపీ మాజీ వైస్‌ ప్రెసిడెంట్‌ తిరుపతి మాట్లాడుతూ.. తుంగభద్ర నది తీరంలో సారవంతమైన భూములు విషతుల్యం కానున్నాయని, ప్రభుత్వం ఎందుకు మౌనంగా ఉంటున్నదని ప్రశ్నించారు. అన్నం పెట్టే రైతుల భూముల్లో ఇథనాల్‌ విషాన్ని నింపితే భవిష్యత్‌ తరాలు అనారోగ్యాలకు గురవుతాయని హెచ్చరించారు. దీనికి వ్యతిరేకంగా గ్రామస్తులు పట్టుదలతో పోరాడటం గొప్ప విషయమన్నారు. ఇథనాల్‌ కంపెనీ రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఇప్పటికే వినతులు కూడా వెళ్లాయని, కాంగ్రెస్‌ సర్కారు దిలావర్‌పూర్‌ వంటి నిర్ణయం తీసుకొని ప్రజలకు మద్దతుగా నిలవాలని కోరారు. ఇథనాల్‌ రద్దు ఉద్యమం కోసం పాలమూరు వర్సిటీ విద్యార్థుల మద్దతు కూడా ఉంటుందని తెలిపారు. ఈ నేపథ్యంలో పాలమూరు, గద్వాల డిగ్రీ కాలేజీ విద్యార్థులు గ్రామాల్లోకి వచ్చి ప్రచారం చేయాలని యోచిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఉద్యమం మరింత ఉధృతమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

తాజావార్తలు