ఆర్టీసీ ప్రైవేటీకరణ పిటీషన్‌పై విచారణ వాయిదా!


– పిటీషనర్‌ అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేయాలన్న హైకోర్టు
– 11కు విచారణ వాయిదా వేసిన న్యాయస్థానం
– ఆలోపు ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని సూచన
హైదరాబాద్‌, నవంబర్‌8((జనంసాక్షి)) : తెలంగాణ ఆర్టీసీలో 5,100 రూట్ల ప్రైవేటీకరణకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై తదుపరి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించింది. టీఎస్‌ఆర్టీసీలో ప్రైవేటు బస్సులకు అనుమతిస్తూ రాష్ట్ర కేబినెట్‌ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ తెజస ఉపాధ్యక్షుడు విశ్వేశ్వరరావు దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయస్థానం శుక్రవారం విచారణ చేపట్టింది. ఈ విషయంలో మంత్రివర్గ నిర్ణయాలను తమ ముందుంచాలని ఆదేశించింది. పిటిషనర్‌ అభ్యంతరాలపై కౌంటర్‌ దాఖలు చేయాలని అదనపు అడ్వకేట్‌ జనరల్‌ను ఆదేశిస్తూ విచారణను సోమవారానికి వాయిదా వేసింది. రాష్ట్ర కేబినెట్‌  ప్రొసీడింగ్స్‌ను తమ ముందు ఉంచాలని తెలిపింది. సోమవారం వరకు ఆర్టీసీ రూట్ల ప్రైవేటీకరణపై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇదిలాఉంటే అదే రోజు ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదలకు సంబంధించి కూడా హైకోర్టు విచారణ చేపట్టనుంది. గురువారం ఆర్టీసీ సమ్మె, కార్మికుల జీతాల నిలుపుదల, ఆర్టీసీ ప్రైవేటీకరణకు సంబంధించిన పిటిషన్లపై విచారణ చేపట్టిన హైకోర్టు.. కార్మికులతో చర్చలు జరపాలని మరోసారి ప్రభుత్వానికి సూచించింది. అధికారులు సమర్పించిన లెక్కలు గజిబిజిగా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం ప్రజల పట్ల చూపాల్సింది అధికారం కాదని.. జౌదర్యం అని సూచించింది. ఈ సందర్భంగా కేంద్రం తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్‌ సొలిసిటర్‌ జనరల్‌ నామవరపు రాజేశ్వరరావు వాదనలు వినిపిస్తూ.. టీఎస్‌ఆర్టీసీ ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం తమ వద్ద నుంచి అనుమతి తీసుకోలేదని అన్నారు.