కంటోన్మెంట్‌ విలీనం కోసం యత్నిస్తా

share on facebook

సమస్యలను పరిష్కరించేలా చూస్తా: రేవంత్‌
హైదరాబాద్‌,జూన్‌7(జ‌నంసాక్షి): కంటోన్మెంట్‌ను జీహెచ్‌ఎంసీలో విలీనం చేయడానికి తన వంతు కృషి చేస్తానని మల్కాజిగిరి ఎంపీ రేవంత్‌రెడ్డి చెప్పాడు. విడివిడిగా ఉండడం వల్ల్‌ నగరంలో అభివృద్ది కుంటుపడుతోందని అన్నారు. అతాగే వేర్వేరు వ్యవహరాలుగా పనులు ఉన్నాయని అన్నారు. కంటోన్మెంట్‌ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎస్‌వీఆర్‌ చంద్రశేఖర్‌ను ఆయన కలిశారు. కంటోన్మెంట్‌ ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యలు, పెండింగు ప్రాజెక్టులపై చర్చించారు. కంటోన్మెంట్‌ అభివృద్ధికి, ప్రజల సమస్యల పరిష్కారానికి, సంక్షేమానికి తీసుకోవాల్సిన చర్యలపై కేంద్ర రక్షణ శాఖ మంత్రితో మాట్లాడతానన్నారు. కంటోన్మెంట్‌లో నీటి సరఫరా అస్తవ్యస్తంగా ఉన్నదని, ఆస్తిపన్ను వసూలులో వ్యత్యాసం ఉన్నదని, బంగ్లాలను, లీజు స్థలాలను చాలా మంది ఏళ్లుగా ఆక్రమించి అడ్డగోలు వ్యాపారాలు చేస్తున్నారని అన్నారు. అందుకే జీహెచ్‌ఎంసీలో కంటోన్మెంట్‌ను విలీనం చేయాలనే అంశాన్ని ఉధృతం చేస్తామని, దీనికి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తానని వెల్లడించారు. కొత్త సచివాలయ నిర్మాణం కోసం సికింద్రాబాద్‌లోని బైసన్‌ పోలో, జింఖానా మైదానాలను వదులుకునేది లేదని స్పష్టం చేశారు. ఇప్పుడా అవసరం కూడా లేదన్నారు. మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో రైల్వే ప్రాజెక్టులు సత్వరమే పూర్తి కావడానికి, రైల్వే ప్రయాణికుల సదుపాయాల మెరుగుకు, రైల్వే ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ రేవంత్‌రెడ్డి అన్నారు. సికింద్రాబాద్‌లోని దక్షిణమధ్యరైల్వే జనరల్‌ మేనేజర్‌ గజానన్‌ మాల్యతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని రైల్వే ప్రాజెక్టులు, రైల్వే స్టేషన్లలో సదుపాయాలు, రైల్‌ ఓవర్‌ వంతెనలు, రైల్‌ అండర్‌ బ్రిడ్జీలు, ఎంఎంటీఎస్‌ రెండో విడత పనులు, శంషాబాద్‌ విమానాశ్రయానికి ఎంఎంటీఎస్‌ కనెక్టివిటీ, ఎంఎంటీఎస్‌ రెండో ప్రాజెక్టులో రాష్ట్ర ప్రభుత్వ వాటా ఎంత వరకు చెల్లించినదీ, చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి పనులు తదితర అంశాలపై జీఎంతో చర్చించారు. ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేయాలని, రైల్వే స్టేషన్లలో ప్రయాణికులకు సదుపాయాలు మెరుగుపరచాలని జీఎంను కోరారు.  జంటనగరాల్లో రైల్వే ప్రాజెక్టులు, చర్లపల్లి టెర్మినల్‌ అభివృద్ధి విషయంలో ఆశించిన స్థాయిలో పురోగతి లేదన్నారు. ఎంఎంటీఎస్‌ రెండో దశ రైళ్లు ఇంకా పట్టాలెక్కలేదని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద నిధులు ఇంకా రైల్వేకు అందలేదని చెప్పారు. ఆయా ప్రాజెక్టులు, పనుల కోసం కేంద్ర ప్రభుత్వంతో మా ట్లాడతానని, రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. దేశంలోనే మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గానికి ప్రత్యేకత ఉన్నదన్నారు.

Other News

Comments are closed.