పాఠశాలలు 25వరకు సిద్ధంగా ఉండాలి

share on facebook

– అందుకు మార్గదర్శకాలు రూపొందించాలి

– మంత్రి సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్‌,జనవరి 12(జనంసాక్షి): కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ విద్యాసంస్థలు నిర్వహించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. విద్యాసంస్థల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన నేపథ్యంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్‌, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్‌ ననీన్‌ మిత్తల్‌, ఇతర ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. తొమ్మిది, పది, ఇంటర్‌, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.విద్యా సంస్థల్లో భోజన సదుపాయాల ఏర్పాటుకుగానూ బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూరుస్తారని మంత్రి తెలిపారు. జిల్లా, మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలన్నారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ నెల 18న ఆయా స్థానిక మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు. ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రైవేట్‌ విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలని.. ఈనెల 19న ప్రైవేట్‌ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు.

Other News

Comments are closed.