పుల్వామాలో కాల్పులు

share on facebook

– నలుగురు ఉగ్రవాదులు హతం
– వీరిలో ఒకరు మాజీ పోలీస్‌ అధికారి
శ్రీనగర్‌, జూన్‌7(జ‌నంసాక్షి) : జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా దళాలకు మధ్య మరోసారి ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో నలుగురు ముష్కరులు హతమయ్యారు. పుల్వామా జిల్లాలోని లాసీపొర ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు గురువారం రాత్రి అక్కడకు చేరుకుని నిర్భంద తనిఖీలు చేపట్టాయి. ఈ సమయంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. సైన్యం కాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు హతమైనట్టు అధికారులు తెలిపారు. వీరిలో ఒకరు మాజీ పోలీస్‌ అధికారి కూడా ఉన్నట్టు వెల్లడించారు. అతడు స్పెషల్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా పనిచేస్తూ ఉగ్రవాదిగా మారినట్టు వివరించారు. ఘటనా స్థలంలో మూడు ఏకే 47 తుపాకులు, అధునాతన ఏకేఎంతోపాటు భారీగా పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
ఉగ్రవాదిగా మారిన పోలీస్‌ అధికారి సర్వీస్‌ రైఫిల్‌ కూడా అక్కడ లభించింది. పోలీస్‌ అధికారి కొద్ది రోజుల నుంచి కనిపించకుండాపోయినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. అయితే, ఉగ్రవాద సంస్థలో చేరిన 24 గంటల్లోనే భద్రతా దళాలు అతడిని మట్టుబెట్టాయి. ఆ ప్రాంతంలో ఇంకా ఇద్దరు లేదా ముగ్గురు తీవ్రవాదులున్నారనే సమాచారంతో భద్రతా సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా లాసీపొరలో ఇంటర్నెట్‌ సేవల్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

Other News

Comments are closed.