పెరుగుతున్న పెద్దపులుల సంఖ్య  

మంచి ఫలితాలు ఇస్తున్న జాతీయ ప్రాజెక్టు
ఆదిలాబాద్‌, సెప్టెంబర్‌24 (జనంసాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా అంటేనే దట్టమైన అడవులు. తరువాత గుర్తుకు వచ్చేది ఆ ఆడవుల్లో ఆవాసం ఉండే పులులు. ఒకప్పుడు ఈ అడవుల్లో లెక్కకు మిక్కిలి పులులు సంచరించేవి. కానీ గత కొన్నేళ్లుగా పులుల సంఖ్య తగ్గింది. ఈ నేపథ్యంలో పెద్ద పులుల సంరక్షణకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపట్టటంతో ఇప్పుడు పరిస్థితి మెరుగుపడుతోంది. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా అడవుల్లో పెద్ద పులుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. పులుల ఆవాసానికి యోగ్యంగా ఉన్నాయని ఈ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం టైగర్‌ కారిడార్‌గా ప్రకటించి పెద్దపులి సంరక్షణకు చర్యలు చేపడుతోంది. 2015లో మహారాష్ట్ర నుంచి కాగజ్‌నగర్‌ అడవులకు వచ్చిన పాల్గుణ అనే పులి సంతానోత్పత్తి చేస్తుండటం తో పులుల సంఖ్య పెరుగుతోంది. కాగజ్‌నగర్‌ అడవు ల్లో 8 పులులు ఉండగా మంచిర్యాల ఫారెస్టు డివిజ న్‌లో మరో రెండు పులులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. తాజాగా రెండు రోజుల కిందట నెన్నె ల మండలం బొప్పారం అటవీ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పెద్దపులి అడుగులను గుర్తించారు. గతంలో నీల్వాయి అడవుల్లో సంచరిస్తున్న పులి ఇటువైపు వచ్చిందా.. ఈ పాటికే ఉన్న దానికి తోడుగా మరొకటి కొత్తగా వచ్చి చేరిందా అనే కోణంలో ఆధారాల సేకరణలో అధికారులున్నారు. బొప్పారం ప్రాంతంలో తిరుగుతున్న పులి కొత్తగా వచ్చినదైతే వాటి సంఖ్య 11కు చేరుతుంది.
పులుల ఆవాసానికి.. సంతానోత్పత్తికి అనుకూలం గా ఉన్న కాగజ్‌నగర్‌ అటవీ ప్రాంతాన్ని కేంద్ర ప్రభుత్వం టైగర్‌ కారిడార్‌గా ప్రకటించింది. సెంట్రల్‌ స్పాన్సర్స్‌ స్కీం ప్రాజెక్ట్‌ (సీఎస్‌ఎస్‌పీటీ) బృందం వేసవి కాలంలో
ఈ ప్రాంతంలో పర్యటించింది. ఐదు గురు సభ్యులతో కూడిన బృందం సమర్పించిన నివేదిక మేరకు కేంద్ర ప్రభుత్వం కాగజ్‌నగర్‌ అడవులను టైగర్‌ కారిడార్‌గా ప్రకటించి పెద్దపులుల సంరక్షణకు పటిష్టచర్యలకు పూనుకున్నది. మహారాష్ట్ర నుంచి ఇక్కడికి పులులు వచ్చి సంతానోత్పత్తి చేస్తు న్నాయని.. ఆ పిల్లలను పరిరక్షించి వాటిని టైగర్‌ కారి డార్‌ ద్వారా జన్నారం టైగర్‌ జోన్‌కు పంపించాలని సిఫారసు చేసింది. టైగర్‌ కారిడార్‌ ఏర్పాటుతో మహారాష్ట్రలోని తాడోబా నుంచి కాగజ్‌నగర్‌ విూదుగా కవ్వాల్‌ అభయారణ్యానికి పులులు స్వేచ్ఛగా రాక పోకలు సాగించే విధంగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.
పులుల సంతతి అభివృద్ధికి ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కృషి జరుగుతోంది. కవ్వాల్‌లో 89,990 చదరపు హెక్టార్ల విస్తీర్ణంలో 2012 ఏప్రిల్‌ 12న టైగర్‌ రిజర్వు ఏర్పాటు చేశారు. దేశంలో ఈ టైగర్‌ రిజర్వు ఫారెస్టు 41 కాగా, తెలంగాణలో ఏకైక పులుల సంరక్షణ కేంద్రం ఇదే. కేంద్ర ప్రభుత్వం భారీగా నిధులు వెచ్చిస్తున్నది. అభయారణ్యాన్ని కోర్‌, బఫర్‌ ఏరియాలుగా విభజించి పులుల సంరక్షణకు చర్యలు చేపడుతున్నారు. టైగర్‌జోన్‌ పరిధిలో ఉన్న గ్రామా లకు ఇతర చోట్ల పునరావాసం కల్పిస్తున్నారు. అడ విలో పెద్దపులికి ఆవాసయోగ్యంగా ఉండే వాతా వరణం, వసతులు కల్పించారు. ఈ ప్రాంతం నుంచి రాత్రి పూట వాహనాల రాకపోకలను నిషేధిం చారు. పులుల ఆహారం కోసం శాఖాహార జంతువు లను పెంచుతున్నారు. ఒక్కో పులికి ఏడాదికి 70 నుంచి 80 శాఖాహార జంతువులు ఆహారంగా అవస రం అవుతాయని గుర్తించారు. అందుకు తగ్గ చర్యలు చేపడుతున్నారు.
వేటగాళ్ల నుంచి ముప్పు పొంచి ఉండటంతో అధికారులు వాటి సంచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు.
ఈ ప్రాంతంలో పులుల సంచారం పెరుగుతుండటంతో వేటగాళ్లు సైతం పన్నాగాలు పన్నే అవకాశం ఉంది. అటవీ ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నారు. గతంలో కోటపల్లి మండలంలో ఒక పెద్దపులి వేటగాళ్లు అమర్చిన కరెంటు తీగలు తగిలి మృతిచెందింది. పెంబీ సెక్షన్‌లోని పాలగంపాండ్రి ప్రాంతంలో పెద్దపులిని హతమార్చి చర్మాన్ని తీసుకొని కళేబరాన్ని దహనం చేసిన సంఘటన చోటుచేసుకుం ది. నీల్వాయి అడవుల్లో ఒక పులి ఇప్పటికి నడుముకు ఉచ్చుతోనే తిరుగుతోంది. దాన్ని పట్టుకొని ఉచ్చు తొలగించాలని అధికారులు చేసిన ప్రయత్నాలు విఫల మయ్యాయి. నెలల తరబడి ఉచ్చుతోనే తిరుగు తుండటంతో ఆ పులి ఆరోగ్యం క్షిణించే అవకాశా లున్నాయి. పులుల సంఖ్య పెరుగుతోందని సంతోషప డటం కంటే వాటి సంరక్షణకు పకడ్బందీగా చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న పులులను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైన ఉందని జంతు ప్రేమికులు అంటున్నారు.

తాజావార్తలు