మూడెకరాల పంపిణీ మరిచారు
ఆరోగ్యశ్రీ ఆగిపోయినా పట్టించుకోని సర్కార్: సిపిఐ
ఆదిలాబాద్,ఆగస్ట్19 (జనం సాక్షి) : బలహీన వర్గాల వారికి రెండు పడక గదుల ఇళ్లు, దళితులకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేయడంలో తెరాస ప్రభుత్వం జాప్యం చేస్తుందని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ ఆరోపించారు. రేషన్ కార్డులు జారీచేయడం లేదన్నారు. ఇకపోతే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. పేదలకు ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం తగదన్నారు.
దేశంలో దోపిడీ వ్యవస్థ పెరిగిందని దాని నిర్మూలనకు సీపీఐ పార్టీ ఉద్యమాలు నిర్మిస్తుందని వెల్లడించారు. రైతులకు గిట్టుబాటు ధరలు, నాణ్యత ఉన్న విత్తనాలు, క్రిమిసంహారక మందులు అందక… ప్రజలు అల్లాడుతున్నారని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఇదిలావుంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రాజెక్టులు, భవనాల నిర్మాణాల పేరుతో కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రజలను మాయమాటలతోనే మోసం చేస్తున్నారని అన్నారు. కేసీఆర్ గుళ్లు, గోపురాలు నూతన భవనాల నిర్మాణాలను ఇచ్చిన ప్రాధాన్యత ఉద్యోగులకు, కార్మికులకు ఇవ్వడం లేదని ఆరో పించారు. గత 20 ఏళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన కార్మికులుగా పని చేస్తున్న వారికి చాలీచాలని వేతనాలు చెల్లించడం పై ఎన్నో పోరాటాలు నిర్వహించామన్నారు. దశల వారీగా ఆందోళనలు చేపట్టి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేసిన నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మధ్యాహ్న భోజన కార్మికులకు సరైన వేతనాలు చెల్లించడంతో పాటు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. కనీస వేతనం రూ.18వేలు చెల్లించి మేను చార్జీలు పెంచాలని, గుడ్లకు అదనంగా బ్జడెట్ కేటాయించాలని సబ్సిడీ గ్యాస్ ఇవ్వాలని, గుర్తింపు కార్డులు ఇచ్చి ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వడంతో అక్రమ తొలగింపులు అరికట్టాలని డిమాండ్ చేశారు.