అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం

విజయవాడ, ఆగస్టు 3 : కృష్ణా జిల్లా చందర్లపాడులో దుండగుల చేతిలో ధ్వంసమైన భారత రత్న బి.ఆర్‌.అంబేద్కర్‌ విగ్రహానికి ఎంఆర్‌పిఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ శుక్రవారం క్షీరాభిషేకం నిర్వహించారు. అంతకు ముందు ఈ సంఘటనకు నిరసనగా ఎంఆర్‌పిఎస్‌ నాయకులు, కార్యకర్తలు నల్లబ్యాచీలు దరించి ప్రదర్శన నిర్వహించారు. అనంతరం అంబేద్కర్‌ విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా కృష్ణ మాదిగ మాట్లాడుతూ ఈ కేసులోని నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అంతేకాక జాతీయ నేతల విగ్రహాలను ధ్వంసం చేసేవారికి కఠిన శిక్ష పడేలా చట్టాన్ని సవరించాలని ఆయన కోరారు. అంబేద్కర్‌ విగ్రహాలను ధ్వంసం చేయడం ఆనవాయితీగా మారిందని ఇది దురదృష్టకర సంఘటన అని అన్నారు. ఇందుకు పాల్పడే వారిపై పోలీసులు చిన్నపాటి కేసులు పెట్టి వదిలేస్తున్నారని, అందువల్ల ఎవరికి భయం లేకుండా పోతున్నదని అన్నారు. విగ్రహాలను ధ్వంసం చేయడం అనాగరిక, ఆటవిక చర్య అని ఇందుకు ఎవ్వరు ఒడిగట్టరాదని కృష్ణ మాదిగ కోరారు.