దేశానికే ఆదర్శంగా‘ప్రజావాణి’

` 74 % సమస్యల పరిష్కారం గొప్ప విజయం
` భారతదేశంలో ఎక్కడా ఇలాంటి కార్యక్రమం అమలు జరగడం లేదు
` ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్‌(జనంసాక్షి):ప్రజావాణి వంటి కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ అమలు జరగడంలేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. శుక్రవారం ఆయన జ్యోతిరావు పూలే ప్రజా భవన్‌ లో నిర్వహించిన ప్రజావాణి రెండవ వార్షికోత్సవ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రభుత్వం, పాలన ప్రజల కోసమే అని సీఎం రేవంత్‌ రెడ్డి తో పాటు యావత్‌ క్యాబినెట్‌ సహచరులు అంతా కలిసి తీసుకున్న విప్లవాత్మక నిర్ణయం ప్రజావాణి అని డిప్యూటీ సీఎం వివరించారు. ప్రజల సమస్యలు విని పరిష్కారం చేయడానికి ప్రతి మంగళ, శుక్రవారాలు రెండు రోజులపాటు క్రమం తప్పకుండా దరఖాస్తులు తీసుకొని 74% సమస్యలు పరిష్కారం చేయడం గొప్ప విజయమని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజావాణి పెట్టడమే కాదు వచ్చిన దరఖాస్తులను నిబద్దతతో దృష్టి సారించి ఉద్యోగ బృందం ప్రయత్నం చేయకపోతే 74% విజయం సాధ్యం కాదని తెలిపారు. ఇంకా పరిష్కారం కానీ పైప్‌ లైన్‌ లు వంటి అంశాలను పరిష్కరించే అవకాశం ఉందని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ఏ సంకల్పంతో ప్రజావాణిని ప్రారంభించామో ఆ లక్ష్యం నెరవేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఈ కార్యక్రమం క్రమం తప్పకుండా కొనసాగిస్తామని డిప్యూటీ సీఎం అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారానికి సెంటర్‌ ఫర్‌ గుడ్‌ గవర్నెన్స్‌ సహకారంతో ప్రజా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర జిల్లా స్థాయిలో ప్రత్యేక సాఫ్ట్‌ వేర్‌ ఏర్పాటు చేసుకోవడం అభినందనీయం ఉన్నారు. 10 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని పాలించిన వారు ప్రజల కోసం కనీసం ప్రజాభవన్‌ గేట్లు తెరవని వారు కూడా ప్రజావాణి కార్యక్రమాన్ని మొక్కుబడిగా నిర్వహిస్తున్నారు అని మాట్లాడం దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టు ఉందని డిప్యూటీ సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా వానిలో విజయ గాధలు వింటుంటే సిబ్బంది ఎంత చిత్తశుద్ధితో పనిచేశారో వివరించి అభినందించేందుకే తాను ఈ సమావేశానికి వచ్చానని డిప్యూటీ సీఎం తెలిపారు. మా ఆలోచన, పాలన, వ్యవహారం అంతా ప్రజలకే అంకితం అని అన్నారు. రాష్ట్రంలోని సంస్థలు వ్యవస్థలు ప్రజల కోసం ఉపయోగపడాలి అనేదే ప్రజా ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఏమాత్రం భయం లేకుండా ప్రజలు వారి సమస్యలు చెప్పుకునేందుకు ఏర్పాటు చేసిన ఈ భవనాన్ని ఆశీర్వదించండి ప్రజా సమస్యల పరిష్కారంలో ముందుకు వెళదామని డిప్యూటీ సీఎం తెలిపారు.

నైనీలో థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌
` ఏర్పాటుకు తెలంగాణ ప్రభుత్వం అధ్యయనం చేస్తుంది
` ఒరిస్సా సీఎం మోహన్‌ చరణ్‌ మాంజీతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క భేటి
హైదరాబాద్‌(జనంసాక్షి):సింగరేణి ఆధ్వర్యంలో కొనసాగుతున్న నైనీ కోల్‌ బ్లాక్‌ పిట్‌ హెడ్‌ వద్ద థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటు సాధ్య అసాధ్యాలపై తెలంగాణ ప్రభుత్వం ఆదేశాల మేరకు తెలంగాణ అధికారుల బృందం అధ్యయనం చేస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఒడిస్సా సీఎం మోహన్‌ చరణ్‌ మాంజీ తో బేగంపేటలోని ఓ హోటల్లో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఇంధన శాఖ అధికారుల బృందం నైనీ ప్రాంతాన్ని సందర్శించి అంచనాలు రూపొందిస్తుందని తదుపరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంటుందని డిప్యూటీ సీఎం వివరించారు.సమావేశంలో ఇంధన శాఖ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ నవీన్‌ విట్టల్‌, సింగరేణి సిఎండి కృష్ణ భాస్కర్‌ సింగరేణి అధికారులు సత్యనారాయణ, తిరుమలరావు తదితరులు పాల్గొన్నారు.