‘పంచాయతీ’లు ముగిశాయి

` ఇక ఎంపిటిసి,జడ్పీటిసిలపై దృష్టి పెట్టండి
` ఎన్నికలేవైనా మనమే గెలవాలి
` పంచాయతీ పోరులో గులాబీ జెండాను హత్తుకున్న ప్రజలు
` గెలిచిన సర్పంచ్‌ల అభినందనలో కేటీఆర్
రాజన్నసిరిసిల్ల(జనంసాక్షి):పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని.. కానీ ఇప్పుడు బీఆర్‌ఎస్ 80 గ్రామాల్లో గెలిచిందని తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, వార్డు సభ్యులతో రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌లో సమావేశమైన కేటీఆర్.. వారికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిపోయాయి కాబట్టి.. పగలు, పంచాయితీలో పక్కనబెట్టి కలిసికట్టుగా ఉండాలని పిలుపునిచ్చారు. సిరిసిల్ల ప్రజలు గులాబీ జెండాను గుండెలను హత్తుకున్నారని కేటీఆర్ అన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కొన్ని చోట్ల రెండు వైపులా బీఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థులే నిలబడ్డారని తెలిపారు. త్వరలోనే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయని పేర్కొన్నారు. గ్రామ పంచాయతీకి, మండల పరిషత్‌కు అనుసంధానకర్త ఎంపీటీసీ అని కేటీఆర్ తెలిపారు. అలాగే జిల్లా పరిషత్‌కు, మండల పరిషత్‌కు సమన్వయకర్త జడ్పీటీసీ అని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికలతో పంచాయితీలు పక్కనపెట్టాలని సూచించారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ గెలుపు కోసం కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్లలెప్లలెనా డంపింగ్ యార్డులు, ప్రగతి వనాలు ఏర్పాటు చేశామని కేటీఆర్ గుర్తుచేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పల్లెలు నిర్వీర్యం అయ్యాయని విమర్శించారు.సిరిసిల్లలో ఉన్న 57 ఎంపీటీసీ స్థానాలు గెలిచేలా కార్యకర్తలు కృషి చేయాలని పిలుపు నిచ్చారు. అందరూ కలిసి కాంగ్రెస్‌పై కొట్లాడాలన్నారు. గులాబీ గెలుపును చూసి కాంగ్రెస్ పరేషన్ అయితోందని తెలిపారు. ఓడిపోయిన అభ్యర్థులు కూడా ధైర్యంగా ఉండాలని ధైర్యం చెప్పారు. రానున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీచేయాలన్నారు. పాత తరం నాయకులు, కొత్త తరాన్ని కలుపుకుంటూ ముందుకుపోవాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి అప్పటికప్పుడు మాటలు మారుస్తున్నారని కేటీఆర్ అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రేవంత్ రెడ్డి మొదట 66 శాతం సర్పంచ్ స్థానాలు గెలిచామని చెప్పారని తెలిపారు. వెంటనే మాటమార్చి స్థానిక ఎన్నికలతో పార్టీకి సంబంధం లేదంటున్నాడని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి లాగే ఫిరాయింపు ఎమ్మెల్యేలు కూడా మాటలు మారుస్తున్నారని అన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్‌లో చేరానని కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు మాటమార్చి బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని చెబుతున్నారని తెలిపారు. ఏ పార్టీలో ఉన్నారో చెప్పుకోలేని పరిస్థితిలో కడియం, పోచారం ఉన్నారని విమర్శించారు. గడ్డిపోచలాంటి పదవి కోసం చూరుకు గబ్బిలాల్లా వేలాడుతున్నారని ఎద్దేవా చేశారు.గెలుపు కోసం కాంగ్రెస్ ఎన్ని అరాచకాలు చేసినా ప్రజలు మాత్రం బీఆర్‌ఎస్‌తోనే ఉన్నారని కేటీఆర్ స్పష్టం చేశారు. స్థానిక ఎన్నికల్లో గులాబీ ప్రభంజనమే అందుకు నిదర్శనమని చెప్పారు. సర్పంచ్ అయినా ఎమ్మెల్యే, ఎంపీలు అయినా ప్రజల కోసమే పనిచేయాలని అన్నారు. ప్రతిపైసా ప్రజల కోసమే ఖర్చు పెట్టాలని సూచించారు. ఐదు అంచెల్లో ప్రభుత్వాన్ని ఎలా నడపాలో అంబేద్కర్ రాజ్యాంగంలో చెప్పారని గుర్తుచేశారు. కేంద్రం పైసలు ఇయ్యకున్నా.. రాష్ట్ర నిధులు ఉంటాయని తెలిపారు. గ్రామ పంచాయతీ నిధులు ఫైనాన్స్ కమిషన్ నుంచి వస్తాయని పేర్కొన్నారు. దాన్ని ఆపే హక్కు ఎమ్మెల్యేలకు లేదు.. సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఉండదని స్పష్టం చేశారు.



