అదనపు మెడికల్‌ సీట్లన్నీ..

సీమాంధ్రకే దోచిపెట్టిన కిరణ్‌ సర్కార్‌
మాజీ ఎంపీ వినోద్‌ ధ్వజం
హైదరాబాద్‌,, జూలై 2 (జనంసాక్షి): తెలంగాణ ప్రాంతానికి వైద్య సీట్ల కేటాయింపును సాధించడంలో ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సవతితల్లి వైఖరిని అవలంభిస్తున్నారని తెరాస నాయకుడు, మాజీ ఎంపీ బి.వినోద్‌కుమార్‌ ఆరోపించారు. ఎంసిబి 150 సీట్లు కేటాయించగా, అవన్నీ సీమాంధ్ర కళాశాలలకే వెళ్లాయన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సోమవారం విలేకర్లతో వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ గత ఏడు నెలలుగా 3వందల సీట్లను కేటాయింపు జరిగేలా రాష్ట్ర ప్రభుత్వాం ప్రయత్నాలు చేసిందని, అయితే దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగినంత ఒత్తిడి తేలేకపోవడంతో ఎక్కువ సంఖ్యలో సీట్లు రాలేదని, వచ్చిన 150సీట్లనూ సీమాంధ్ర ప్రాంతానికే కేటాయించారని విమర్శించారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా, సికింద్రాబాద్‌లోని గాంధీ, వరంగల్‌లోని కాకతీయ తదితర తెలంగాణలోని ప్రతిష్ఠాత్మక వైద్యకళాశాలలు అదనంగా 150సీట్లు పొందలేక పోయాయన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డికి వినోద్‌కుమార్‌ ఒక ‘లేఖరాస్తూ’ తెలంగాణలోని వైద్య కళాశాలలకు అదనపు సీట్లు లభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోని ఆరు కళాశాలల కోసం ప్రతిపాదనలు పంపినప్పుడు, తెలంగాణలోని కళాశాలలకు ఎందుకు సీట్లు రాలేదు..? సీమాంధ్రలోని కళాశాలలు కేంద్రంనుంచి రూ.80కోట్ల ఆర్థికసాయం ఎలా పొందగలిగాయి..? అని ప్రశ్నించారు.
ముఖ్యమంత్రితో పాటు వైద్య విద్యాశాఖామంత్రి కొండ్రుఏ మురళి, సంబందిత అధికారుల నిర్లక్ష్యం వల్లనే తెలంగాణ ప్రాంతం మరోసారి నిర్లక్ష్యానికి గురయిందని ఆరోపించారు. ప్రభుత్వంపైన అధికారులపైన సీమాంధ్ర రాజకీయనాయకులు ఆధిపత్యం కొనసాగిస్తున్నారని, దీనితో తెలంగాణకి అన్యాయం జరుగుతోందని ఆరోపించారు. మొత్తం ఐఎన్‌ఎస్‌ అధికారుల్లో సగానికిపైగా వేరే రాష్ట్రాలవారని, మిగిలిన వారిలో తెలంగాణకు చెందినవారు 10శాతంకన్నా లేరని చెప్పారు.
ఈ సమస్యపై తెలంగాణ విద్యార్థులు విచారపడొద్దని, ఈ ఆంశంపై కేంద్ర ఆరోగ్యశాఖామంత్రి గులాంనబీ ఆజాద్‌తో, అవసరమైతే ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో తెరాస అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు మాట్లాడతారని చెప్పారు.