అనుకున్నట్టే ఆనం బడ్జెట్‌

ఎన్నికలే లక్ష్యం.. సంక్షేమానికి పెద్దపీట
సాగునీటికి కోత
మొత్తం బడ్జెట్‌ రూ.1,61,348 కోట్లు
ప్రణాళికా వ్యయం రూ. 59,442 కోట్లు
ప్రణాళికేతర వ్యయం రూ1,09,926 కోట్లు
మిగులు రూ. 1,684 కోట్లు
ద్రవ్య లోటు రూ.24,487 కోట్లు
తలసరి ఆదాయం రూ.77,270 వేలు
హైదరాబాద్‌, మార్చి 18 (జనంసాక్షి):
ఎన్ని’కలలు’ కన్న రాష్ట్ర ప్రభుత్వం ఉట్టిదేనని తేలిపో యింది. ఆశల పల్లకిలో ఊరేగించిన ప్రభుత్వ బడ్జెట్‌ ఊరిం చి ఉస్సూరుమనిపించింది-14 రాష్ట్ర బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టింది. సంక్షేమ, అభివృద్ధి పనులకు పెద్దపీట వేస్తూz. 2013, రానున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బడ్జెట్‌ను రూపొందించింది. ప్రధానంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్య మిస్తూ.. భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.1,61,348 కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించిన ప్రభుత్వం.. వ్యవసాయానికి ప్రాధాన్యమిచ్చింది. రూ.25,962 కోట్లతో ప్రత్యేక సమగ్ర వార్షిక ప్రణాళికను రూపొందించింది. అదే సమయంలో జలయజ్ఞం కింద చేపట్టిన సాగునీటి పథకాలకు కోత విధించింది. తాజా బడ్జెట్‌లో సాగునీటి రంగానికి రూ.13,800 కోట్లు కేటాయించారు. 2012-13 బడ్జెట్‌ కంటే ఇది రూ.1400 కోట్లు తక్కువ కావడం గమనార్హం. మరోవైపు, పలు కొత్త పథకాలను ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రవేశపెట్టింది. ఉపకార వేతనల పెంపు, రాజీవ్‌ దీవేన కింద ఎస్సీ విద్యార్థులకు ఉపకార వేతనాలు అనుఖ”న్నట్ణతి ..
అందించడం, కులాంతర, వికలాంగుల వివాహాలకు ప్రోత్సాహాన్ని రూ.10 వేల నుంచి రూ.50 వేలకు పెంచింది. కులాంతర, వికలాంగులను వివాహం చేసుకుంటే గతంలో కేవలం రూ.10 వేలు మాత్రమే ఇచ్చేవారు. ఈసారి బడ్జెట్‌లో దాన్ని రూ.50 వేలకు పెంచారు.
ఆర్థిక మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సోమవారం శాసనసభలో, దేవాదాయ శాఖ మంత్రి సి.రామచంద్రయ్య శాసనమండలిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టారు. జాతిపిత మహాత్మాగాంధీ సూక్తులను ఉటంకిస్తూ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆనం.. తన బడ్జెట్‌ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి దోహదపడగలదని ఆకాంక్షించారు. ముచ్చటగా మూడోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆనం.. పెద్దగా మెరుపులు, విరుపులకు అవకాశం లేకుండా బడ్జెట్‌ ప్రక్రియను ముగించారు. తమ ప్రభుత్వం ఎప్పుడూ వ్యవసాయ రంగానికే అగ్రాసనం వేస్తుందన్నారు. ప్రజల తలసరి ఆదాయం రూ.77,212 వేలకు చేరిందని, ప్రభుత్వ విధానాల వల్లే ఇది సాధ్యమైందన్నారు. 2004లో తలసరి ఆదాయం రూ.25 వేలు ఉండగా, ఇప్పడది మూడు రెట్లకు చేరిందన్నారు. స్థూల ఉత్పత్తి 7.38 లక్షల కోట్ల మేర ఉందని తెలిపారు. వ్యవసాయ రంగంలో ఆరు శాతం వృద్ధి సాధించామని, పారిశ్రామిక రంగంలో 5.5 శాతం వృద్ధి రేటు నమోదు చేశామని వివరించారు. 12వ పంచవర్ష ప్రణాళికా కాలంలో రాష్ట్ర వృద్ధి రేటు 10 శాతం ఉండేలా ప్రభుత్వం లక్ష్యం విధించుకుందని తెలిపారు. ఆహార ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ కోసం రాష్ట్రంలో ప్రత్యేక ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
గొప్పలకే పరిమితం..
బడ్జెట్‌పై గొప్పలు చెప్పుకున్న ప్రభుత్వం… చివరకు ఏ రంగానికీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేక పోయింది. ప్రధానంగా పారశ్రామిక రంగాభివృద్ధికి తీసుకోనున్న చర్యలు, విధాన నిర్ణయాలు ప్రకటించడంలో పూర్తిగా విఫలమైంది. ఇక, ఆర్థిక మంత్రి ప్రసంగంలో కీలకమైన చేనేత శాఖ ప్రస్తావనే రాలేదు. ఆ శాఖకు కేటాయింపులు కానీ, చేనేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యల గురించిన కానీ ప్రస్తావనే రాకపోవడం గమనార్హం. మరోవైపు, సంక్షేమానికి పెద్దపీట వేశామని ప్రభుత్వం ప్రకటించినా.. అందులోనూ వాస్తవం లేదని కేటాయింపులను బట్టి తెలుస్తోంది. మహిళలకు భద్రతకు అగ్రప్రాధాన్యం ఇస్తామని చెప్పినప్పటికీ, మహిళా శిశు సంక్షేమ నిధులను పెద్దగా పెంచకపోవడం విశేషం. గృహనిర్మాణానికి, ఇతర ప్రాధాన్యతా రంగాలకు కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల కనిపించ లేదు. నీటిపారుదల రంగానికి కోతతో పాటు ప్రజారోగ్యానికి అంతంత మాత్రంగానే నిధులు కేటాయించింది.

సంక్షేమానికి పెద్దపీట
వచ్చేది ఎన్నికల సంవత్సరం కావడంతో ప్రభుత్వం సంక్షేమానికి పెద్దపీట వేసింది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు గత కేటాయింపుల కంటే రెట్టింపు స్థాయిలో నిధుల్ని కేటాయించింది. గతేడాది సాంఘిక సంక్షేమ శాఖకు 1,719 కోట్లు కేటాయిస్తే.. తాజా బడ్జెట్‌లో రూ.4,122 కోట్లు కేటాయించింది. ఇది గతం కంటే దాదాపు రెండింతల అదనం. దళిత, గిరిజనుల అభివృద్ధికి ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్టం అమలులోకి తీసుకువచ్చిన ప్రభుత్వం ఆయా వర్గాల సంక్షేమానికి అగ్రతాంబులమిచ్చింది. బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించింది. ఎస్సీ సబ్‌ప్లాన్‌కు రూ. 8, 585 వేల కోట్లు, షెడ్యూల్‌ తెగల ఉప ప్రణాళిక కోసం రూ.3,666 కోట్లు కేటాయించింది. ఇక, బీసీ సంక్షేమానికి కూడా భారీగానే నిధులు వెచ్చించారు. 2012-13 బడ్జెట్‌లో రూ.2,656కోట్లు కేటాయించగా.. దాన్ని రెట్టింపు చేస్తూ తాజా బడ్జెట్‌లో రూ.4,027 కోట్లకు పెంచారు. గిరిజన సంక్షేమానికి రూ.2,126 కోట్లు కేటాయించారు. ఇది గతేడాది కంటే రూ.1,013 కోట్లు అదనం. మైనార్టీ సంక్షేమానికి కేటాయింపుల్లో కూడా భారీగానే పెంచేశారు. 2012-13 బడ్జెట్‌లో కేవలం రూ.482 కోట్లు కేటాయిస్తే.. దాన్ని తాజా బడ్జెట్‌లో రూ.1,027 కోట్లకు పెంచారు. అయితే, మహిళా శిశు సంక్షేమ శాఖ కేటాయింపుల్లో పెద్దగా పెరుగుదల కనిపించ లేదు. ఆ శాఖకు కేవలం రూ.2,712 కోట్లు, వికలాంగుల సంక్షేమానికి రూ.73 కోట్లు కేటాయించారు.
సాగునీటి రంగానికి కోత..
జలయజ్ఞానికి పెద్దపీట వేస్తామంటూనే.. గత రెండేళ్లుగా సాగునీటి రంగానికి కోతలు పెడుతున్న ప్రభుత్వం ఈసారీ కూడా బడ్జెట్‌లో కోత పెట్టింది. గతేడాది బడ్జెట్‌లో రూ.15 వేల కోట్ల పైచిలుకు నిధులు కేటాయించిన ప్రభుత్వం ఈసారి సాగునీటి రంగానికి రూ.13,800 కోట్లు మాత్రమే విదిల్చింది. గతేడాది కంటే ఇది రూ.1200 కోట్ల తగ్గింపు కావడం గమనార్హం. నీటి పారుదల శాఖకు రూ.22,895 కోట్లు
కేటాయించారు. జలయజ్ఞం మొత్తం వ్యయ అంచనా రూ.1.26 లక్షల కోట్లు కాగా, ఇప్పటివరకు రూ.67,208 కోట్లు ఖర్చు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. రానున్న బడ్జెట్‌లో అదనంగా 21,345 లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు. పోలవరం, ఇందిరాసాగర్‌ ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టులకు జాతీయ ¬దా కల్పించేందుకు ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తోందని చెప్పారు. పోలవరం అంచనా వ్యయం రూ.16,010 కోట్లు అని, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణ వ్యయం రూ.38,500 కోట్లు అని తెలిపారు. ఆయా ప్రాజెక్టులకు జాతీయ ¬దా లభిస్తే.. నిర్మాణ వ్యయాల్లో 90 శాతం కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందన్నారు. అనుమతి రాగానే, పోలవరం, ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణాలను ప్రారంభిస్తామని తెలిపారు. తాగునీటి కోసం రూ.262 కోట్లు కేటాయించారు. వర్షాధారిత వ్యవసాయ అభివృద్ధికి రూ.2,903 కోట్లు కేటాయించారు.
విద్యారంగానికి పెరిగిన కేటాయింపులు
ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో విద్యారంగానికి నిధులు భారీగానే కేటాయించింది. పాఠశాల విద్యకు రూ.16.900 కోట్లు, ఉన్నత విద్యకు రూ.4,082 కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపింది. అలాగే, విద్యార్థుల మెస్‌ చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. ఇందుకోసం రూ.250 కోట్లు కేటాయించింది. 7వ తరగతి వరకు మెస్‌ చార్జీలు రూ.575 నుంచి రూ.750కి, 8 నుంచి పదో తరగతి వరకు రూ.535 నుంచి రూ.85కి పెంచుతున్నట్లు ప్రకటించింది. అలాగే, ఇంటర్‌, డిగ్రీ, పీజీ వరకు మెస్‌చార్జీలు 520 నుంచి రూ.1050కి పెంచించింది. ఇక, ఎస్సీ, బీసీ విద్యార్థుల కోసం ‘రాజీవ్‌ దీవేన’ పేరుతో కొత్త పథకం అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ పథకం కింద మూడు లక్షల విద్యార్థులకు ఉపకార వేతనలు అందజేయనున్నట్లు ఆనం తెలిపారు. మధ్యాహ్న భోజన పథకానికి కూడా నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. మధ్యాహ్న భోజన పథకం రాష్ట్రంలో 70.5 లక్షల మంది బాలబాలికలు లబ్ధి పొందుతున్నారని చెప్పారు. పాఠశాలలన్నింటిలోనూ వంటశాలల నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు ప్రకటించారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో పాటు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులు కేటాయిస్తుందన్నారు. నెల్లూరు జిల్లాలో మరో వైద్య కళాశాలకు ప్రభుత్వం పాలనపర అనుమతి మంజూరు చేస్తున్నట్లు ఆనం ప్రకటించారఉ. ఇందుకోసం రూ.358 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. నిజామాబాద్‌ జిల్లాలో వైద్య కళాశాలకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు ప్రకటించారు.
విద్యుత్‌కు పెద్దపీట
రాష్ట్ర బడ్జెట్‌లో ప్రభుత్వం విద్యుత్‌ రంగానికి భారీగానే నిధులు కేటాయించింది. మొత్తం రూ.7,117 కోట్ల మేర నిధులు కేటాయిస్తున్నట్లు ఆనం తెలిపారు. రానున్న ఏడాది కాలంలో 2,200 మెగావాట్ల అదనపు విద్యుత్‌ ఉత్పాదనకు చర్యలు తీసుకోనున్నట్లు ప్రకటించారు. వ్యవసాయానికి ఏడుగంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఉచిత విద్యుత్‌ను కొనసాగిస్తామని తెలిపారు. వ్యవసాయ విద్యుత్‌ రాయితీ కోసం రూ.3,621 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. జైకా సహకారంతో 16 జిల్లాల్లో 2.43 లక్షల వ్యవసాయ కనెక్షక్లకు నాణ్యమైన విద్యుత్‌ కోసం రూ.1154 కేటాయించినట్లు వివరించారు. ఈ ఏడాది జనవరి వరకు కొత్తగా 94,304 విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చామన్నారు.
సేవలు
మౌలిక సదుపాయాల కల్పన, సేవల రంగానికి గతేడాది బడ్జెట్‌లో కేటాయించిన నిధుల కంటే ఈసారి ఎక్కువగానే కేటాయించారు ఆనం. మౌలిక సదుపాయాల కల్పనకు రూ.180 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య
శాఖలకు రూ.1120 కోట్లు కేటాయిస్తన్నట్లు తెలిపారు. రహదారులు, రవాణ శాఖకు రూ.7,1117 కోట్లు కేటాయించారు. యువజన సేవలకు రూ.280 కోట్లు వెచ్చించనున్నట్లు ఆనం తెలిపారు. అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ఉపాధి హావిూ పథకం కింద రూ.2,700 కోట్లు వెచ్చిస్తున్నట్లు చెప్పారు. అలాగే, రాష్ట్రంలో అన్ని మండల కేంద్రాల్లో క్రీడాప్రాంగణాలు ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. ఇందుకోసం రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. రాజధాని నగరంలో మెట్రో రైలు నిర్మాణం కోసం భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ.1,980 కోట్లు కేటాయించారు. పౌరసరఫరాల శాఖకు రూ.3,231 కోట్ల నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉగాది నుంచి ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తొమ్మిది నిత్యావసర వస్తువలను తక్కువ ధరలకే సరఫరా చేయనున్నట్లు ఆనం తెలిపారు. ఇందుకోసం రూ.660 కోట్లు కేటాయిస్తున్నామన్నారు. రూపాయికే కిలో బియ్యం పథకం వల్ల కోట్లాది మంది పేదలకు ఆహార భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. తాగునీటి సరఫరాకు నిధులు పెంచుతున్నట్లు తెలిపారు. వేసవి పరిస్థితులు అధిగమించేందుకు రూ.262 కోట్లు, ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొనేందుకు రూ.332 కోట్లు కేటాయించామన్నారు. హైదరాబాద్‌కు తాగునీటి వసతి పెంపు కోసం చర్యలు తీసుకోనున్నట్లు ఆనం తెలిపారు. గోదావరి ఎత్తపోతల పథకం, కృష్ణా మూడో దశ పనుల కోసం రూ.6,770 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. కృష్ణా మూడో దశ పనులు పూర్తి చేసేందుకు రూ.1,670 కోట్లు కేటాయించామన్నారు.
చిత్తూరు జిల్లాలో ఇన్‌క్యాప్‌ ద్వారా తాగునీటి సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లోనూ స్త్రీ నిధి పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు.
శాంతిభద్రతలు…
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆనం తెలిపారు. మహిళలకు భద్రతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు బడ్జెట్‌లో రూ.5,386 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. పోలీసు శిక్షణ సంస్థల ఆధునికీకరణకు రూ. 100 కోట్లు కేటాయించామన్నారు. త్వరలోనే పోలీసు శాఖలో నియామకాలకు నోటిఫికేషన్‌ జారీ చేయనున్నట్లు ప్రకటించారు. హైదరాబాద్‌లో సమగ్ర నిఘా కెమెరా వ్యవస్థ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
కీలక నిర్ణయాలు
– ఈ ఏడాది కొత్తగా 27,903 ఉద్యోగాలు కల్పిస్తామని ఆర్థిక మంత్రి రాంనారాయణరెడ్డి ప్రకటించారు
– తిరుపతి, జహీరాబాద్‌లలో ¬టళ్ల నిర్వహణకు ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆనం ప్రకటించారు.
– నెల్లూరు మరో మెడికల్‌ కాలేజీ ఏర్పాటుకు పాలనాపరమైన అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. ఇందుకోసం రూ. 358 కేటాయిస్తున్నట్లు తెలిపారు.
– 18 కొత్త రెవెవన్యూ డివిజన్లు, 52అర్బన్‌ మండలాలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు
– ఆర్థిక శాఖలో ఆన్‌లైన్‌ మానిటరింగ్‌ వ్యవస్థలో భాగంగా బిల్‌ మానిటరింగ్‌ ఏర్పాటు
– గ్రీన్‌ చానల్‌ పథకం, ఆరోగ్యశ్రీ పథకాల కొనసాగింపు
– రాష్ట్రంలో ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ ఏర్పాటు
– రెవెన్యూ ఉద్యోగుల శిక్షణ కోసం ప్రత్యేక రెవెన్యూ అకాడవిూ ఏర్పాటు

కీలక రంగాలకు కేటాయింపులివి.. రూ.కోట్లల్లో
పట్టణాభివృద్ధి 6,770
వైద్య ఆరోగ్య శాఖ 6,481
గ్రావిూణాభివృద్ధి 11,220
రహదార్లు, రవాణ శాఖ 7,117
ఆర్‌అండ్‌ బీ 5,450
గృహ నిర్మాణం 2326
సమాచార, సాంకేతిరంగం 207
పారిశ్రామిక రంగం 1120
పర్యాటక రంగం 163
అడవులు, పర్యావరణం 551
విూ సేవకు 207
ఐటీ శాఖ 207