కాంగ్రెస్ పార్టీని ఓడించండి

 

 

 

 

జనం సాక్షినవంబర్ హైద‌రాబాద్ : కాంగ్రెస్ ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా నిరుద్యోగులు పోరాటం చేస్తున్నారు. నిరుద్యోగుల అండ‌దండ‌ల‌తో అధికారాన్ని చేజిక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ.. ఉద్యోగ నోటిఫికేష‌న్లు ఇవ్వ‌కుండా మోసం చేయ‌డంతో నిరుద్యోగ అభ్య‌ర్థులు మండిప‌డుతున్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక‌లో పోటీ చేస్తున్న నిరుద్యోగ యువ‌తి ఆస్మా రేవంత్ స‌ర్కార్‌కు వ్య‌తిరేకంగా ప్ర‌చారం ముమ్మ‌రం చేశారు.

కాంగ్రెస్ పార్టీని ఓడించాలని మోకాళ్ల మీద నిలబడి ప్రాధేయపడింది ఆస్మా. మా నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలంటే, రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీని ఓడించాలని జూబ్లీహిల్స్ ప్రజలను ఆమె వేడుకుంది.

ఈ సంద‌ర్భంగా ఆస్మా మాట్లాడుతూ.. నిరుద్యోగ అభ్య‌ర్థులం ఎంతో ఆవేద‌న చెందుతున్నాం. ఉద్యోగాలు లేక జాబ్ నోటిఫికేష‌న్లు లేక తీవ్ర మాన‌సిక వేద‌న‌కు గుర‌వుతున్నాం. కాంగ్రెస్ గ‌వ‌ర్న‌మెంట్‌లో అనేక ఉద్యోగాల‌ను అమ్ముకున్నారు. జీవో 29 వ‌ల్ల చాలా మందిమి నిరుద్యోగుల‌ను కోల్పోయాం. మ‌హిళ‌ల‌కు ఫ్రీ బ‌స్సు ప‌థ‌కం పెట్టారు. కానీ పురుషుల‌కు ఛార్జీలు రెట్టింపు చేశారు. నాడు నిరుద్యోగులంద‌రం క‌లిసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాం. కానీ ఇవాళ మ‌మ్మ‌ల్ని కాంగ్రెస్ పార్టీ ప‌ట్టించుకోవ‌డం లేదు. మ‌మ్మ‌ల్ని కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది అని ఆస్మా నిప్పులు చెరిగారు.