రాత్రికి రాత్రే సీసీఐ నిబంధనలు మార్పు

 

 

 

 

 

నవంబర్ 03 (జనంసాక్షి) సీసీఐ నిబంధనలుపత్తి రైతులను కుంగదీస్తున్నాయి. ప్రభుత్వం పత్తి రైతుకు మద్దతు ధర చెల్లించేందుకు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు రోజుకో నిబంధనలు జారీ కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

సోమవారం జిల్లాలోని వివిధ ప్రాంతాలకు చెందిన పత్తి రైతులు సీసీఐ ద్వారా ప్రతిని విక్రయించేందుకు మండలంలోని విజయ కాటన్ ఇండస్ట్రీ వద్దకు వాహనాలతో చేరుకున్నారు. ఉదయం 8:30 గంటలకు కొనుగోలు ప్రారంభించిన అధికారులు ఎకరాకు 7 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే ప్రభుత్వ తాజా నిర్ణయం మేరకు పత్తి తూకం చేస్తామని స్పష్టం చేశారు.

దీంతో ఆగ్రహించిన పత్తి రైతులు ఎకరాకు 12 క్వింటాళ్ల నిబంధనతో ఆన్‌లైన్‌ ద్వారా ముందస్తుగా స్లాట్ బుకింగ్ చేసుకున్నామని వివరించారు. కొత్తగా నిబంధనలు పెట్టి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ కొనుగోళ్లను అడ్డుకున్నారు. ఇండస్ట్రీ గేటు ముందు ప్రధాన రహదారిపై బైఠాయించి రైతులు ఆందోళనకు దిగారు.

నిబంధనల పేరుతో ప్రభుత్వం, అధికారులు పత్తి రైతులను దగా చేస్తున్నారని సీపీవో శ్రీనివాసులును నిలదీశారు. రైతుల ధర్నాతో నారాయణపేట, మక్తల్ పట్టణాల వైపు వెళ్లాల్సిన వాహనాలు దాదాపు గంటపాటు నిలిచి పోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఊట్కూరు ఎస్సై రమేష్ ఇండస్ట్రీ వద్దకు చేరుకొని రైతులను సముదాయించారు.

విషయాన్ని అధికారుల దృష్టికి తెలపడంతో నారాయణపేట జిల్లా మార్కెట్ కార్యదర్శి భారతి, ఏవో గణేష్ రెడ్డి చేరుకుని సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తెలిపారు. మధ్యాహ్నం 11:30 గంటల తర్వాత యధావిధిగా ఎకరాకు 12 క్వింటాళ్ల చొప్పున పత్తిని కొనుగోలు చేసేందుకు ఆదేశాలు అందినట్లు సీసీఐ అధికారులు ప్రకటించడంతో రైతులు శాంతించి ధర్నాను విరమించారు.