కాంగ్రెస్ తోక క‌త్తిరించేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నారు

 

 

 

 

 

నవంబర్1  జనం సాక్షిహైద‌రాబాద్ : రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తి లెక్క ఫీల్ అవుతున్నాడు.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తా అని ఓటర్లను బెదిరిస్తున్నాడు అని వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. ఆయన అట్ల బెదిరిస్తే.. ఓటర్లు ఆయన తోక కట్ చేస్తారు అని కేటీఆర్ విమ‌ర్శించారు.

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో టీడీపీ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జ‌రిగాయి. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో టిడిపి జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ నాయుడు, ఇతర టిడిపి నాయకులు బీఆర్ఎస్‌లో చేరారు. వారంద‌రికీ గులాబీ కండువాలు క‌ప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేటీఆర్.

ఈ సంద‌ర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. ఓటమి భయంతో రేవంత్‌ రెడ్డి ప్రజలను బెదిరిస్తున్నారు. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని రేవంత్‌ రెడ్డి భ్రష్టు పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటికొచ్చిన హామీలన్నీ ఇచ్చిన కాంగ్రెస్‌.. ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని చెప్పి.. ఇప్పుడు ప్రజల మెడలో గొలుసులు కూడా లాక్కుంటోందని సెటైర్లు వేశారు. అటు.. ఫ్రీ బస్‌ పేరుతో భార్య డబ్బులను కూడా భర్త నుంచి వసూలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక.. కేసీఆర్‌ ఉన్నప్పుడు ఎన్నో పథకాలు అమలయ్యాయని గుర్తు చేశారు కేటీఆర్‌. కల్యాణలక్ష్మీ, షాదీముబారక్‌, కేసీఆర్‌ కిట్‌ ఇచ్చారని చెప్పారు. ఆడపిల్ల పుడితే రూ.13వేలు, అబ్బాయి పుడితే రూ.12 వేలు అందించామని వెల్లడించారు. ఇలాంటి ఎన్నో పథకాలను రేవంత్‌ సర్కార్‌ బంద్‌ చేసిందని అన్నారు కేటీఆర్‌. కేసీఆర్‌ కిట్‌, న్యూట్రిషన్‌ కిట్‌, రంజాన్‌ తోఫా బంద్‌, బతుకమ్మ చీరలు బంద్‌, క్రిస్మస్‌ గిఫ్ట్‌.. ఇలా అన్నీ పథకాలను బంద్‌ చేసిందని మండిపడ్డారు.

మరోవైపు.. ప్రజలనే బెదిరించే స్థాయికి రేవంత్ రెడ్డి చేరుకున్నారని ఫైరయ్యారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఎన్నికలు వస్తే ఎవరైనా ఏం చేస్తారో చెప్తారు.. కానీ రేవంత్‌ రెడ్డి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హామీలు అమలు చేయకపోగా.. అన్ని బంద్‌ చేస్తామంటూ ప్రజలకు వార్నింగ్‌ ఇస్తున్నారని చెప్పారు. రేవంత్‌ రెడ్డికి పదవి ఇచ్చిందే ప్రజలు.. అది మర్చిపోయి రాజులా ఫీలవుతున్నారని మండిపడ్డారు. రేవంత్‌ రెడ్డి ప్రజల సొమ్ముకు ధర్మ కర్త అంతే అని.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే ప్రజలు బుద్ధి చెబుతారని కేటీఆర్‌ హెచ్చరించారు.

అసలు కాంగ్రెస్‌ పార్టీకి ప్రజలు ఎందుకు ఓటేయాలని ప్రశ్నించారు కేటీఆర్‌. రియల్‌ ఎస్టేట్‌ నాశనం చేశారు.. ఇందిరమ్మ రాజ్యం అంటూ పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హైడ్రా, బుల్డోజర్‌ పేరుతో పేదలపై జులుం ప్రదర్శిస్తున్నారని ఫైరయ్యారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయకపోగా.. రెండేళ్లలోనే రాష్ట్రాన్ని భ్రష్టుపట్టించిన కాంగ్రెస్‌ తోక కత్తరించాలని పిలుపునిచ్చారు. భర్త చనిపోయి మాగంటి సునీత ఏడిస్తే.. దాన్ని కూడా డ్రామా అంటున్న కాంగ్రెస్‌కు మహిళలు గట్టిగా బుద్ధి చెప్పాలని కోరారు. ముఖ్యమంత్రిగా కేసీఆర్‌ను మళ్లీ తెచ్చుకోవాలంటే.. జూబ్లీహిల్స్‌ నుంచే జైత్రయాత్ర ప్రారంభం కావాలన్న కేటీఆర్‌.. ఈ నెల 11న కారు గుర్తుకు ఓటేసి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.