అనుమానాస్పద సూట్‌కేసును
పేల్చేన బాంబుస్క్వాడ్
కడప, జూలై 30 : దాదాపు అర్థరోజుపైబడి పోలీసులను తీవ్ర ఆందోళనకు గురి చేసిన అనుమానాస్పద ఒక సూట్‌కేసును ఎట్టకేలకు సోమవారం సాయంత్రం బాంబు డిస్పోజల్ బృందం స్క్వాడ్ డెటినెటర్లతో పేల్చివేశారు. సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. కడప రైల్వే స్టేషన్‌లోని మొదటి తరగతి ప్రయాణికుల విశ్రాంతి గది ముందు భాగాన ఒక కుర్చీలో గుర్తు తెలియని వ్యక్తి ఆదివారం రాత్రి ఒక సూట్‌కేసును వదిలిపెట్టి వెళ్లాడు. ఆ వ్యక్తి స్టేషన్‌లోకి వస్తున్న సమయంలో టికెట్ కలెక్టర్ ప్లాట్‌ఫాం టికెట్ అడిగారు. తన స్నేహితులు బయట ఉన్నారని, అప్పటివరకు ఈ సూట్‌కేసు ఇక్కడే ఉంటుందని చెబుతూ ఆ సూట్‌కేసు కుర్చీకి తన కర్చీప్‌తో ముడివేసి వెళ్లాడు. అప్పటి నుండి సోమవారం ఉదయం వరకు ఆ సూట్‌కేసు కుర్చీలోనే ఉంది. దీంతో రైల్వే సిబ్బంది ఈ సమాచారాన్ని రైల్వే పోలీసులకు చేరవేశారు. పోలీసులు, బాంబు స్క్వాడ్ సిబ్బంది రంగప్రవేశం చేసి డిటెక్టర్‌తో తనిఖీ చేశారు. ఆ సూట్‌కేసులో అనుమానాస్పద పరికరాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆ సూట్‌కేసును అతి జాగ్రత్తగా రైల్వే స్టేషన్ సమీపంలోని ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల మైదానంలోకి తీసుకెళ్లారు. అక్కడ సూట్‌కేసును పేల్చివేసే ప్రయత్నం చేశారు. అయితే చివరి నిమిషంలో పోలీసులు తమ మనసును మార్చుకొని నగర శివారులో ఉన్న పోలీసు పైర్ రేంజ్ మైదానంలోకి తీసుకెళ్లారు. అక్కడ తర్జనభర్జనల అనంతరం సోమవారం సాయంత్రం డిటినెటర్లతో సూట్‌కేసును పేల్చివేశారు. సూట్‌కేసుపైన ఎస్.మిర్షాద్ అనే పేరు ఉంది. సూట్‌కేసు లోపల లాప్‌ట్యాప్, కెమెరా, బట్టలున్నాయి. రిజర్వ్‌డు ఎస్సై కైలాశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది.