అన్యాయానికి గురవుతున్న శ్రామికవర్గాలు

నిజామాబాద్‌, జూలై 19 : అణగారిన వర్గాలు, శ్రామిక వర్గాలను అన్యాయం చేస్తున్నాయని, అందుకని శ్రామిక వర్గానికి రాజ్యాధికారం కావాలని భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఐలయ్య డిమాండ్‌ చేశారు. నగరంలోని వినాయక్‌నగర్‌ శ్రీవినాయక కళ్యాణ మండపంలో భవన నిర్మాణ రంగాల జిల్లా, నగర కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కార్మిక శాఖ ఉన్నా భవన నిర్మాణ కార్మికులకు 1996 చట్టం గురించి కార్మికులకు ఇప్పటి వరకు అవగాహన లేదన్నారు. అన్ని కులాల వారు రాజకీయాల్లో రాణిస్తున్నారని, భవన నిర్మాణ రంగ కార్మికులు ఇప్పటి వరకు ఎక్కడా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, భవన నిర్మాణ కార్మికులు ఒక కార్పొరేటర్‌గాను, ఒక కౌన్సిలర్‌గానో, వార్డు సభ్యునిగానో పోటీ చేసి తీరాల్సిందేనన్నారు. ఎస్సీ, ఎస్టీలు భవన నిర్మాణ రంగాల్లో పని చేస్తున్నారని, వీరికి రిజర్వేషన్లు కూడా కల్పించాలన్నారు. ప్రభుత్వం భవన నిర్మాణ రంగ కార్మికుల పట్ల చిన్నచూపు చూస్తుందని, మనం ఐక్యంగా ఉంటే ప్రభుత్వం దానంతట అదే దిగి వస్తుందన్నారు. అగ్రవర్ణాల ఆదిపత్యాన్ని అధిగమించి భవన నిర్మాణ రంగ కార్మికులు ఐక్యంగా పని చేయాల్సి ఉంటుందన్నారు. జిల్లా అధ్యక్షుడు కల్లెడి గంగాధర్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థలు వస్తున్నందున భవన నిర్మాణ కార్మికులు రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు ఎన్నికల్లో పోటీ చేసి తమ సత్తాను నిరూపించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో భవన నిర్మాణ రంగాల కార్మికులు కొండయ్య, శాంతయ్య, విఠల్‌, రతన్‌, సాయిబాబా, రాములు, గంగారాం, నర్సింలు, గంగాధర్‌, శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.